పరిగి, మే 18 : ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పరిగిలోని ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు ఆశ వర్కర్లు ధర్నా చేపట్టి కార్యాలయం ఉద్యోగికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లకు ప్రతినెల ఒకటవ తేదీన పారితోషికాలు చెల్లించాలని, రూ.18వేల ఫిక్స్డ్ వేతనం, ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఆశ వర్కర్లు గత 20 సంవత్సరాలుగా పేదలకు ఆరోగ్య సేవలందజేస్తున్నారని, ఆశ వర్కర్లకు వేతనాలు పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ వెంటనే హామీని నెరవేర్చాలన్నారు. రూ.50లక్షలు బీమా సదుపాయం, రూ.50వేలు మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన పారితోషికాలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే ఆశ వర్కర్లకు డబ్బులు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి మంగమ్మ, నాయకురాళ్లు స్వరూప, సుజాత, యాదమ్మ, రమాదేవి, పద్మమ్మ, మొగులమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.