డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ శీతాకాల రాజధాని డెహ్రాడూన్, పరిసర జిల్లాల్లో సోమవారం మేఘ విస్ఫోటం కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తి 15 మంది మరణించగా మరో 16 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం సంభవించింది. సహస్త్రధారలో మంగళవారం వచ్చిన ఆకస్మిక వరదలకు హోటళ్లు, దుకాణాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా వాణిజ్య సంస్థలు, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం జరిగింది. వరద ప్రవాహంలో పలువురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. డెహ్రాడూన్‌లోని మాల్దేవత, ముస్సోరీ నుంచి కూడా ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందుతున్నట్లు విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాలలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లు, ఇళ్లు, దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఓ వంతెన కొట్టుకుపోయిందని ఆయన చెప్పారు. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు ఆయన తెలిపారు. బాధిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 300 నుంచి 400 మంది ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. టంకేశ్వర్లోని భగత్ సింగ్ కాలనీలో వరదల్లో నలుగురు వ్యక్తులు కొట్టుకుపోగా ముస్సోరీలో ఝరీపానీ టోల్ ప్లాజాపై కొండచరియ విరిగిపడి కార్మికుడు మరణించాడు