మేడ్చల్, సెప్టెంబరు 16: రోడ్డు ప్రమాదం యువ డాక్టర్ను చిదిమేసింది. మరో ఏడాదిన్నరలో వైద్య విద్య పూర్తి చేసి, వైద్య వృత్తిలోకి రానున్న యువతిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఆమెతో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇస్లావత్ అనూష(20) మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఘనపూర్లో ఉన్న మెడిసిటీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నది.
మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహేశ్వర్ రెడ్డితో కలిసి బైక్పై కళాశాల నుంచి కొంపల్లి వైపు బయల్దేరింది. ఈ క్రమంలో కండ్లకోయ ఆక్సిజన్ పార్కు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ(ఎంపీ28హెచ్ 3645) ఢీ కొట్టింది. దీంతో వారిద్దరు రోడ్డుపై పడిపోగా అనూష పై నుంచి లారీ వెళ్లింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. లారీని డ్రైవర్ అజాగ్రత్తగా, అతి వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.