సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆగస్టులో ఇతర రాష్ర్టాలకు చెందిన 61మందిని అరెస్ట్ చేశారని, పలు సైబర్ కేసులకు సంబంధించిన బాధితులకు రూ.1,01,39,338లు రిఫండ్ చేసినట్లు హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఆగస్ట్‌లో 338 ఎన్సీఆర్పీ ఫిర్యాదులు స్వీకరించగా అందులో 233 ఎఫ్ఐఆర్లు సైబర్ పోలీస్ స్టేషన్ నుంచి, 90ఎఫ్ఐఆర్లు జోనల్ సైబర్ సెల్స్‌లో రిజిస్టర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తాము అరెస్ట్‌చేసిన వారిలో ట్రేడింగ్ ఫ్రాడ్స్, సోషల్‌మీడియా రిలేటెడ్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ స్కామ్స్, సోషల్‌మీడియా టిప్‌లైన్, అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్, ఇంపర్సనేషన్, లోన్‌ఫ్రాడ్, కాపీరైట్ యాక్ట్, ఓటీపీ ఫ్రాడ్ తరహా మోసాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. తమిళనాడు, కర్ణాటక మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, అసోం, ఉత్తరాఖండ్, రాజస్థాన్ తదితర రాష్ర్ర్టాలకు చెందిన నిందితులు ఉన్నారని, వీరిపై 132 కేసులు నమోదుకాగా తెలంగాణలో 30 కేసులున్నట్లు విశ్వప్రసాద్ తెలియజేశారు.