న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 : ఆలయాలకు భక్తులు ఇచ్చే విరాళాలు కల్యాణ మండపాలు నిర్మించడానికి కాదని పేర్కొన్న సుప్రీం కోర్టు.. దేవాలయ నిధులు ప్రజల నిధులుగానో, ప్రభుత్వ నిధులగానో పరిగణించకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తమిళనాడులోని ఐదు దేవాలయాలకు చెందిన నిధులను రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో కల్యాణ మండపాల నిర్మాణానికి మళ్లిస్తూ ప్రభుత్వం నిర్ణయించడాన్ని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కొట్టివేసింది.
వివాహాల కోసం కల్యాణ మండపాలను అద్దె ప్రాతిపదికన ఇవ్వడం ధార్మిక ప్రయోజానాన్ని నెరవేర్చదంటూ ఆగస్టు 19న పేర్కొన్న హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలను నిలిపివేసింది. దీనిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.