హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: ‘ఇరవై ఏండ్లుగా ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాం. 2005 నుంచి జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో డాటా ఎంట్రీ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. మా యవ్వనమంతా ప్రభుత్వానికే ధారపోశాం. ఇప్పుడు మాకు 45-50 ఏండ్లు వచ్చాయి. ఇప్పుడు ఒక్కసారి రోడ్డున పడేస్తే మా కుటుంబాలను ఎట్ల పోషించుకోవాలి.’ అని డాటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వడంతోపాటు తక్షణమే తమను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. అబిడ్స్ బొగ్గులకుంటలోని ట్రెజరీస్ డైరెక్టర్(బీమా) కార్యాలయం ఎదుట శుక్రవారం ఔట్సోర్సింగ్ డాటా ఎంట్రీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇందిర, ట్రెజరర్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.