తిరుమలగిరి, మార్చి 3 : రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు.. మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి అవగాహన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ నేతగా రాష్ట్రం ఏర్పాటుకు ముందే వ్యవసాయం, నీటి పారుదల, విద్యావ్యవస్థలో సమూల మార్పులకు బ్లూప్రింట్ సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఆ మేరకు ప్రాధామ్యాల వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. వ్యవసాయాన్ని తీర్చిదిద్ది, సాగునీరు అందించి ప్రస్తుతం మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. నియోజకవర్గంలో 107 పాఠశాలలు మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికయ్యాయని తెలిపారు. మూడు విడుతల్లో ఆయా పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పూర్వ విద్యార్థులు సైతం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ రజాక్, మూడు జిల్లాల డీఈఓలు భిక్షపతి, నర్సింహ, అశోక్, మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.