హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకొచ్చిన ధరణి వెబ్ పోర్టల్ విజయవంతంగా కొనసాగుతున్నదని, ఇప్పటివరకు 10.35 లక్షల స్లాట్స్ బుక్కయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన బీఆర్కే భవన్లో ధరణి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ విజయవంతంగా కొనసాగేందుకు కృషిచేస్తున్న కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అభినందించారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు.