హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో ఓ ఇంజినీరింగ్ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తార్మాకలోని ఓయూ బిల్డింగ్ డివిజన్లో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ ( DEE ) గా పనిచేస్తున్న రాకొండ శ్రీనివాసులు ( DEE Rakonda Srinivasulu ) మంగళవారం తన కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 6 వేలు లంచం ( Bribe ) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
వర్సిటీలోని మానేరు బాలుర హాస్టల్ పునరుద్దరణ పనులు చేసినందుకు గాను రావాల్సిన రూ. 7.37 లక్షల బిల్లు కోసం కాంట్రాక్టర్ సదరు డీఈఈని సంప్రదించాడు. దీంతో రూ.11 వేల లంచం డిమాండ్ చేసి మొదట విడతగా రూ. 6వేలు నగదు, మిగత రూ.5 వేలను ఫోన్ పే ద్వారా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రూ.6వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతి అధికారి శ్రీనివాసులును నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని అధికారులు వివరించారు.