Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా విశ్వంభర సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ టీజర్లో నాసిరకం విజువల్స్ ఉండడంతో అభిమానుల నుంచి పెద్దఎత్తున్న విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సినిమా VFXపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం 2026 సమ్మర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు, ‘విశ్వంభర’పై సాధారణ ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ నుంచి ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలను భారీగా పెంచేందుకు మేకర్స్ త్వరలోనే పవర్ఫుల్ టీజర్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ త్రిష చాలా ఏళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో తెలుగులో స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించిన త్రిష, కొంతకాలంగా పూర్తిగా తమిళ సినిమాలకే పరిమితమైంది. మెగాస్టార్‌తో ఆమె జోడీ కట్టడంపై ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వర ప్రసాద్ గారు చిత్రం విడుదలైన తర్వాతే, విశ్వంభర ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.