తిరుమల : టీటీడీ పాలకవర్గ సమావేశం ( TTD Board Meeting ) మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( BR Naidu ) అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 60 కీలక అంశాలను ఆమోదిస్తూ సమావేశం తీర్మానించింది. తిరుమలలో ఉన్న ప్రధాన రహదారులు, కూడళ్ల పేర్లను మార్పునకు కమిటీ వేసి వారి సూచనల మేరకు పేర్లను మారుస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు.
టీటీడీ ఇంజినీరింగ్ నాలుగు విభాగాల్లో ఉన్న 60 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తలకోన సిద్దేశ్వరస్వామి ఆలయ నిర్మాణ రెండో దశ పనులకు అదనంగా రూ. 14.10 కోట్లు మంజూరు చేశామన్నారు.
తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో 270 హాస్టల్ సీట్లు పెంపునకు, టీటీడీ కి చెందిన ఎస్వీ జూనియర్, మహిళా డిగ్రీ కళాశాలలో డే స్కాలర్స్‌కు మధ్యాహ్న భోజన పథకం అమలుకు పాలకవర్గం ఆమోదించిదని వెల్లడించారు.
టీటీడీ పరిధిలోని ఆలయాలకు ధ్వజస్తంభాలు , రథాలు తయారు చేసేందుకు వంద ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. పద్మావతి చిన్న పిల్లల హృదయాలంలో సౌకర్యాల కల్పనకు రూ.48 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన విధానం తీసుకురావాలని నిర్ణయించా మన్నారు. ముంబాయి బాంద్రా ప్రాంతంలో రూ. 14.40 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టనున్నామని వివరించారు.