సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్లో ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా ఎంచుకున్న స్పీడ్ ప్రణాళికలలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఒక్కటి. సచివాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వివిధ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, స్థలం కేటాయింపు తదితర అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. గోషా మహల్‌లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు సుమారు 32 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం పోలీస్ విభాగంలో ఉన్న ఈ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ స్థలంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.
రాబోయే 50 ఏండ్లలో అవసరాలను అంచనా వేసుకుని కొత్త ఆసుపత్రి నిర్మాణం డిజైన్ ఉండనుంది. అంతేకాదు వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. అంతేకాదు ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కార్పొరేట్ తరహాలో వైద్యం అందేలా సదుపాయాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాంక్రీట్ భవంతులు, బహుళ అంతస్తులు కాకుండా ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఉండేలా ప్రణాళికలు చేయాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి నిపుణులైన ఆర్కిటెక్ట్స్‌తో డిజైన్లు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆసుపత్రిని చారిత్రక కట్టడాలుగా పరిరక్షించనున్నారు. కాగా గోషా మహల్ స్థలాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించనున్నారు.