Telangana | ప్రచార పర్వంలో నోరు జారడం కామన్. ఓ పార్టీ నుంచి మరోపార్టీలోకి వెళ్లిన జంప్ జిలానీలు పుసుక్కున పాత పార్టీకి జైకొట్టడం ఎన్నికల సిత్రాల్లో మామూలే! కానీ, ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గమ్మతుంది. రోడ్ షోలు, పల్లె యాత్రల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులకు చెయ్యెత్తి జైకొట్టక తప్పడం లేదేమో! ఐదేండ్ల కిందటో, పదేండ్ల కిందటో ప్రచారానికి తిరిగిన ఊర్లకు ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం తిరుగుతున్నారు. ఈ కాస్త కాలంలో గ్రామాల రూపురేఖలు మారడం చూసి కేసీఆర్ను తలుచుకోకుండా ఉండలేకపోతున్నారని పబ్లిక్ టాక్!
ఊరి పొలిమేర్లలో కనిపిస్తున్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామాలను చూసి ‘అమ్మా.. ఇవన్నీ భలే కట్టారే?’ అని మనసులోనే అనుకుంటున్నారు కావచ్చు. ఊర్లల్లో ప్రతి గల్లీకి సీసీరోడ్డు, రోడ్డుకు ఇరువైపులా అందంగా కనిపిస్తున్న మొక్కలను చూసి ‘ఊర్లు చాలా మారినయ్ కదా’ అని లోలోపల ఆశ్చర్యపోతున్నార్ట. ఇంటింటికీ నల్లా చూసి.. ఆ గల్లీలోకి వెళ్లడానికి జంకుతున్న కాంగ్రెస్ నేతలు.. అంతరంగంలో మాత్రం కేసీఆర్కు జేజేలు పలుకున్నారల్లే ఉన్నది. అయితే, ఇవేమీ బయటికి మాత్రం చెప్పలేరాయె. కానీ, ఎక్కడో ఒక దగ్గర మనసులోని మాట బయటపడుతుంది కదా! మొన్న అదే జరిగింది. పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశస్వినిరెడ్డి విషయంలో అదే జరిగింది. నియోజకవర్గంలో ఓ రోడ్ షోలో ప్రసంగించిన ఆమె.. చివరిగా ‘జై కేసీఆర్’ అని గట్టిగా నినదించారు. పొరపాటున అన్నారులే అనుకోవడానికి.. ఆమె గతంలో ఎన్నడూ బీఆర్ఎస్లో పని చేసిందీ లేదు. రాజకీయాల్లోకి కొత్త కూడా! అందుకే, కండ్ల ముందున్న అభివృద్ధిని చూసి ఉన్నమాట అనకుండా ఉండలేకపోయారని ఓటర్లు భావిస్తున్నారు.
– వరుణ్