హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మధుసూదనాచారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మధుసూదనాచారి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ‘ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు సత్వరమే చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, చికుడు ప్రభాకర్, పృథ్వీరాజ్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.