హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాడు చేపట్టిన మరో మానవీయ కార్యక్రమం త్వరలో ఆవిష్కృతం కానున్నది. అవయవ మార్పిడి చికిత్సలు పేదలకు మరింత అందుబాటులోకి తేవాలన్న ఆయన సంకల్పం త్వరలో ఫలితాలను ఇవ్వనున్నది. దానికోసం కేసీఆర్ హయాంలో చేపట్టిన ఎస్‌వోటీసీ (స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్) త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ప్రజారోగ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పునాదులు వేసిన వైద్య, ఆరోగ్యరంగ అభివృద్ధి ఫలాలు ఇలా నేడు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిమ్స్, ఉస్మానియా దవాఖానలకే పరిమితం కావడంతో రోగులకు సకాలంలో శస్త్రచికిత్స జరుగడంలేదని నాటి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే గాంధీ దవాఖానలో ప్రత్యేకంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎస్‌వోటీసీ ఏర్పాటుకు ఆమోదం తెలిపి, పనులు ప్రారంభించింది.
ఇప్పటికి ఆ పనులు పూర్తయ్యాయి. రూ.35 కోట్లతో ఎస్‌వోటీసీ ఏర్పాటుకు 2022లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. ఆ తర్వాత మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లలో వైద్యపరికరాల కోసం 2023లో మరో రూ.5 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా రూ.40 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక వైద్యపరికరాలు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్‌తో ఎస్‌వోటీసీ నిర్మాణ పనులు ప్రారంభయ్యాయి. 2024లో ఆ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. 2023 అసెంబ్లీ ఎన్నిక సమయానికే పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పనులు నత్తనడకన సాగాయి. చివరికి పనులు పూర్తయ్యాయి. మొత్తంగా దాదాపు రెండేండ్లు ఆలస్యమైనా ఎస్‌వోటీసీ అందుబాటులోకి వస్తుండటంపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యంపై కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడుతున్నారు.
కార్పొరేట్ దవాఖానల్లో ఒక్కో కిడ్నీ మార్పిడికి సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌కు సైతం ఇదే స్థాయిలో వసూలు చేస్తారు. కాలేయం, గుండెమార్పిడి శస్త్రచికిత్సకైతే రూ.40 లక్షల వరకు చెల్లించాల్సిందే. జీవన్‌దాన్ డాటా ప్రకారం అవయవ మార్పిడి అవసరమున్న రోగుల్లో కిడ్నీ మార్పిడి కోసం నిరీక్షిస్తున్న రోగులు అత్యధిక సంఖ్యలో మొదటి స్థానంలో ఉండగా, బోన్‌మ్యారో అవసరమున్న క్యాన్సర్ రోగులు రెండో స్థానంలో, కాలేయ మార్పిడి అవసరమున్న రోగులు మూడో స్థానంలో, గుండె మార్పిడి శస్త్రచికిత్స అవసరమున్న రోగులు నాలుగో స్థానంలో ఉన్నట్టు తెలుస్తున్నది. బాధితుల్లో దాదాపు 80 శాతం మంది నిరుపేద రోగులే ఉండటంతో వారు కార్పొరేట్ దవాఖానల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకొనే స్థోమత లేక ఎందరో ప్రాణాలు కోల్పోయేవారు. మరికొందరు ఉన్న ఆస్తిపాస్తులను అమ్ముకొని అవయవ మార్పిడి చేయించుకుని, జీవితాంతం ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు. నిరుపేదల ఆరోగ్య ఆక్రందనలను చూసి చలించిన కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలనే సంకల్పంతో ఖరీదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతోపాటు శస్త్రచికిత్సల కోసం అవసరమైన వైద్య సదుపాయాలూ పెంచింది. అవయవ మార్పిడి చికిత్సకు అయ్యే ఆర్థిక భారాన్ని తొలగించినా, సర్జరీల్లో వేగం పెరుగడం లేదని గుర్తించింది. అందుకే అవయవ మా ర్పిళ్లకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే గాంధీ దవాఖానలో ఎస్వోటీసీని ఏర్పాటు చేసేందుకు 2022లో శ్రీకారం చు ట్టింది. మెయిన్ బ్లాక్‌లోని 8వ అంతస్తును దానికోసమే పూర్తిగా కేటాయించింది.
ప్రస్తుతం కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు ఉస్మానియా, నిమ్స్ దవాఖానల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఉస్మానియాలో 2013 నుంచి 2022 మార్చి 10 వరకు 13 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు, నిమ్స్‌లో 11 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్టు జీవన్‌దాన్ అధికారులు వెల్లడించారు. ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానల్లో కలిపి 2013 నుంచి ఇప్పటివరకు 932 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్టు తెలిపారు. ప్రస్తుతం దాదాపు 3,000 మందికిపైగా రోగులు కాలేయ మార్పిడి కోసం నిరీక్షణలో ఉన్నట్టు తెలుస్తున్నది. గాంధీ దవాఖానలో నిర్మించిన ఎస్వోటీసీలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కేర్ యూనిట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. కిడ్నీ మార్పిడి కోసం ప్రత్యేకంగా రెండు థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి.
కాక్లియర్ ఇంప్లాంట్ (లోపలి చెవి వినికిడి ఇంప్లాంట్)
రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. ట్రయల్స్ కోసం సన్నాహాలు చేస్తున్నాం.. అవి పూర్తవగానే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ కిడ్నీ, మోకాళ్ల మార్పిడి, కాక్లియర్ ఇంప్లాంట్, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతాయి. రోగుల సంఖ్య ఆధారంగా భవిష్యత్తులో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలనూ అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ సెంటర్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం 2 మాడ్యులర్ థియేటర్లు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం 2 థియేటర్లు, మోకాలు మార్పిడి కోసం ఒకటి, కాక్లియర్ ఇంప్లాంట్ కోసం ఒకటి చొప్పున మొత్తం 6 మాడ్యులర్ థియేటర్లు సిద్ధమయ్యాయి. మూడు ఐసీయూ వార్డులతోపాటు ఒక పోస్ట్ ఆపరేటివ్ ఐపీయూ వార్డును సైతం సిద్ధం చేశాం.