కారేపల్లి(కామేపల్లి), మార్చి 13 : ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామేపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి పొంగులేటి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. జాస్తిపల్లి గ్రామంలో రూ.3.15 కోట్లతో జాస్తిపల్లి నుండి కెప్టెన్ బంజర రోడ్డు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, లాల్యతండ గ్రామంలో రూ.3 కోట్ల 33 లక్షలతో లాల్యతండా ఆర్ అండ్ బి రోడ్డు నుండి జగన్నాథ తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, ఊటుకూరు గ్రామంలో ముత్యాలమ్మ గుడి నుండి శ్మశాన వాటిక వరకు రూ.కోటి 80 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, తాళ్లగూడెంలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి డోర్నకల్ ఆర్ అండ్ బి రోడ్డు వయా టేకులతండా, పింజరిమడుగు, పాతలింగల మీదుగా రూ.4 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
దీంతో పాటు ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో నిర్మించిన రెండు పడక గదుల నిర్మాణాలను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాలలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామన్నారు. మార్చి చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని ప్రకటించారు. రాబోయే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని తెలిపారు.
పేదింటి మహిళలు ఇబ్బంది పడవద్దని ప్రభుత్వం సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే కోరిన రోడ్డు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఊటుకూరు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేసి వానాకాలం నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, తాసీల్దార్, వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ నెల చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి