వర్గల్,ఫిబ్రవరి 19 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్లో బుధవారం జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో విషా దం నెలకొంది. గౌరారం ఎస్సై కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. జబ్బపూర్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో 30 మందికిపైగా యువకులు పాల్గొన్నారు. వీరిలో లింగ ప్రశాంత్, కొంతం వేణు, కొంతం కనకరాజు, లింగ గణేశ్, దేశెట్టి కరుణాకర్, లింగ మహేశ్ గ్రామచావిడి వద్ద కాషాయజెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. గద్దెవద్ద ఇనుప పైపునకు కాషాయ జెండాను అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తాకగా, లింగ ప్రశాంత్‌తో పాటు మరో ఆరుగురికి షాక్ తగిలింది. వెంటనే వారిని గజ్వేల్ ఏరియా దవాఖానకు తరలించగా లింగ ప్రశాంత్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో దేశెట్టి కరుణాకర్ పరిస్థితి విషమంగా ఉండగా, మిగతావారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపడుతున్నట్టు ఎస్సై తెలిపారు.