హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ.. మే 5న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘ఒక్క రోజు నిరాహార దీక్ష’ చేపట్టనున్నట్టు టీజీఈజేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ విక్రమ్‌కుమార్, కన్వీనర్ కృష్ణయాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు నిరసన కార్యక్రమం నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 17న నిర్వహించిన నిరసన కార్యక్రమం తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే జిల్లాలోని అనుబంధ సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.