హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమించకుండా పకదారి పట్టించేందుకే ప్రభుత్వం బదిలీల ప్రక్రియ తెరపైకి తెచ్చిందని ఎస్టీయూటీఎస్ పూర్వ అధ్యక్షుడు బచ్చు భుజంగరావు విమర్శించారు. మే 5 నుంచి జేఏసీ తదుపరి కార్యాచరణను ప్రకటించబోతున్న కీలక సమయంలో బదిలీల అంశాన్ని తీసుకురావడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. 5 డీఏ బకాయిలు, జూలై 2023 నుంచి అమలు కావాల్సిన నూతన పీఆర్సీ నివేదికను పెండింగ్లో పెట్టి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా, కోర్టు ఆదేశాలు ఉన్నా వారి బకాయిలను చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం కొనుగోలు చేసే వస్త్రాలను టెసో ద్వారానే సేకరించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల భుజంగరావు హర్షం వ్యక్తం చేశారు.