‘బతుకమ్మ పండుగ వత్తే బిడ్డ ముందుగాలొస్తది, దసరాకు అల్లుడు దిగుతడు. పెద్దపండుక్కు బిడ్డా, అల్లుడు వస్తాండ్రని సంబురపడాల్నా, అల్లుడొచ్చినంక ఎట్ల సర్దుకునుడని ఆగం కావాల్నో తెలియని పరిస్థితి. ఉన్నదొక్క అర్ర, ఎనుక చిన్న శాయవానా. వండిన గంజులన్నీ ఇంట్లకు దెచ్చి గిన్నెల్ల అన్నం పెట్టుకొని మంచంలొగలు, పీటేసుకొని ఒగలు తినేలా అలవాటుపడ్డ జీవితం. అల్లుడొచ్చినంక గూడా ఇట్లనే ఒక్కటే అర్రల ఎదురెదురుగా కూసోని తినుడు సానా కట్టం.
పోనీ బిడ్డను, అల్లున్ని ఇంట్లుంచి మనం బైటికెళ్లి తిందామా అంటే అంతా మురుగునీరు కంపు, రోడ్డు మీద వచ్చేటోళ్లు, పోయేటోళ్లు చూసేటట్టు అంతా పరాగతే. ఏం చెయ్యాల్నో ఏందో ఎటూ పొద్దు పోతలేదు, ఏం తోస్తలేదు. దేవుడా నువ్వే దిక్కు. అల్లునికి మర్యాదలు తక్కువ గాకుండా, ఇంటికొచ్చినోడు అల్గిపోకుండా ఉండేట్టు సూడు స్వామీ..’ ఇది తెలంగాణ పల్లెల్లో డబుల్బెడ్రూం ఇల్లు ఇవ్వక
ముందు సామాన్యుడి బతుకు చిత్రం.
ఇల్లు కట్టడానికి చేసిన అప్పు, పెళ్లి కోసం చేసిన రుణభారం ఎప్పటికీ తీరదు. వాటితో వచ్చే అనుభవం మరెప్పటికీ కలుగదని గమనించిన పెద్దలు అప్పుడెప్పుడో ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అని ముందుతరాలకు చెప్పారు. ఇల్లు కట్టడమంటే ఎంత కష్టమైన పనో వారి మాటల వెనుక నిగూడార్థం. ఇల్లుపై పెట్టిన పెట్టుబడి తీరదు. తెచ్చిన అప్పులకు మిత్తీలు పెరుగక ఆగవు. పండిన పంటంతా అప్పులకు, వడ్డీలు కట్టుడుకే సరిపోతుంది. ఇన్ని కష్టాల్లో సొంతిల్లు కట్టుకోవాలని ఆలోచన చేయడం, దాన్ని కార్యాచరణ దిశగా ముందుకు తీసుకెళ్లడం నిజంగా ఓ సవాల్. అంతకు మించి సాహసమే.
రాష్ర్ట ఆవిర్భావానికి ముందున్న కాంగ్రెస్, టీడీపీలు ఇళ్లను రాజకీయ అవసరాలకు వాడుకున్నాయి తప్ప పేదోడి అక్కర తీర్చేందుకు ఏ మాత్రం ప్రయత్నించలేదు. ఇందిరమ్మ ఇల్లు పేరుతో అప్పటి సర్కార్ కట్టిచ్చిన కొంప ఉండటానికి పనికిరాకుండా, వాడటానికి వీలు కాదన్నట్టుగా.. ‘ఉన్నదా బసవా అంటే ఉన్నది..’ అన్నట్టుగా ఉండేది. అదీ కాకుండా ఆ ఊర్లోకి వెళ్తుంటే ఎదురుగా దిష్టిగుమ్మాలుగా దర్శనమిచ్చేవి. డిక్కి రూమ్లు, గట్టిగా తంతే కూలే గోడలతో దూరం నుంచి చూడటానికే కొంప అనిపించేది తప్ప, దగ్గరికెళ్లి చూస్తే ‘ఎల్లిపోయిన కొంప’గా తోచేది. అది ఇల్లా, లేదంటే స్నానం చేసేందుకు కట్టుకున్న చిన్నరూమా అన్నట్టు తోచేవి.
‘ఇల్లు కట్టిస్తే ఇంటిల్లిపాది సంబురపడాలి. తరతరాలకు ఒక వరంగా ఉండాలి’. అనేది ప్రత్యేక రాష్ట్రం లో బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఆలోచన. పండుగొచ్చి నా.. పబ్బమొచ్చినా, ఆపదొచ్చినా.. సంపదొచ్చినా ఇంటోళ్లంతా కలిసి ఒక్కచోట కలుసుకొని, మంచి, చెడులు ముచ్చటించుకుంటూ గడిపేలా ఇల్లు ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ భావించారు. ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వాలు ఇళ్ల పేరిట చేసిన కుట్రలు, అగ్గిపెట్టెల మాదిరి నిర్మాణాలతో జరిగిన తప్పిదాలను తిరిగి చేయొద్దనే సంకల్పంతో ఇంజినీర్లతో చర్చించారు. తెలంగాణ సర్కార్ కట్టించి ఇయ్యబోయే ఆ ఇల్లు, అప్పటికే దగాపడిన తెలంగాణ ప్రజలకు మరోమారు మోసం చేసేదిగా ఉండొద్దనే ఆలోచన చేశారు. కుటుంబమంతా కులాసాగా గడపాలనే సుదీర్ఘ చూపుతో ప్రణాళిక రచన చేశారు. మరీ ముఖ్యంగా పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఇల్లు చిన్నదైతే కలిగే ఇబ్బందులు, ఆ టైంలో తల్లిదండ్రులు పిల్లల కష్టాలను చూడలేక పడే మానసిక సంఘర్షణను అధిగమించేలా ఇంటి నిర్మాణం జరగాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
కలల సౌధం డబుల్ బెడ్రూమ్. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదోడికి సొంతిల్లు ఉండాలనే కేసీఆర్ సంకల్పం నుంచి వచ్చిందే రెండు పడక గదుల ఇల్లు. పొద్దుపోయే వరకు టీవీ చూసుకుంటూ కూర్చుంటే పొద్దంతా కట్టం చేసొచ్చిన అవ్వయ్యకు ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎండలబడొచ్చిన తల్లిదండ్రులు రాత్రిపూట బుక్కెడు బువ్వ తిన్న తర్వాత యాష్టకొచ్చి నిద్రించడానికి ప్రత్యేకంగా ఓ గది ఉండేలా, టీవీ చూసి, చదువైన తర్వాత పిల్లలు కూడా ప్రశాంతంగా నిద్రించేలా మరో గది ఉండేలా రాష్ట్ర సర్కార్ పక్కా ప్రణాళికతో ఇంటి నిర్మాణం చేయించింది. హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఏపీలో కలిసిన తెలంగాణ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిన తీరు, ప్రత్యేక రాష్ట్రంలో మరోమారు కావొద్దని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ గట్టి నిర్ణయం తీసుకుంది. గ్రామాల వారీగా అర్హుల జాబితాలు తీసుకొని, స్థానిక ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ సర్కార్ తన కర్తవ్యాన్ని ఎక్కడా విస్మరించకుండా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి పకడ్బందీగా కేటాయించింది.
ఇల్లున్నదంటే గర్వం. ఇల్లంటేనే సర్వస్వం. పదేండ్ల కిందటి వరకు తల దించుకొని ఇంట్లోకి వెళ్లాల్సిన దుస్థితికి తెలంగాణ సర్కార్ చరమగీతం పాడింది. హుందా గా, నిటారుగా తలెత్తుకుని ఇంట్లోకి వెళ్లేలా, ఇంటినే చూస్తూ, ఇది కదా నేను కలలుగన్నది అనేలా ప్రజలంతా ఖుషీ అయ్యేలా ఇంటిని నిర్మించి ఇచ్చింది. ఇంటికెవరైనా వస్తే ఎలా తప్పించుకుందామా.. అనే దుస్థితి నుంచి, దారిని పోయే వేలు విడిచిన చుట్టాలను కూడా సగర్వంగా ఇంటికి పిలుచుకొని మర్యాదలు చేసేలా సౌకర్యాలు కల్పిస్తూ కట్టించిన ఇళ్లను బహుమతిగా పంపిణీ చేసింది. రెండు పర్యాయాలు అప్రతిహతంగా సాగిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు ఇప్పుడు మరో మారు రికార్డు దిశగా దూసుకెళ్లేలా సీఎం కేసీఆర్
ప్రకటించారు.
ఈ విడత తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఘంటాపథంగా ప్రకటించి తానేంటో మరోమారు సమస్తానికి తెలియజెప్పారు. పోటీల కోసం వేలం వెర్రిగా ప్రకటనలు గుప్పించడం కాదు, ప్రజల కష్టాలు తెలుసుకుని తీర్చడానికి శాయశక్తులా కృషిచేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పకనే చెప్పారు. గృహమే కదా స్వర్గసీమ అన్నట్టుగా నూరేండ్లు మనగాల్సిన కట్టడాన్ని నవ్వుల పాలు చేసేందుకు ఉబలాటపడుతున్న కొన్ని స్వార్థశక్తుల ‘హస్తాల్లో’ ఇళ్లు బందీ కావొద్దని తన మనస్సులో మాటను అందరిముందు ప్రకటించారు. ఇల్లు కట్టిండు అంటే ‘వాడికేంట్రా ఉన్నోడు’ అని భావించే పోకడలను తుదముట్టించి ‘ఇల్లుదేమున్నదిరా.. బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడది అందరికీ సుసాధ్యమే కదా..’ అని ప్రతి నిరుపేద ధైర్యంగా కలలుగనే రోజును కళ్లముందుంచింది. పేదోడి కష్టాన్ని బాపేందుకు తపిస్తున్న ప్రస్తుత తీరును అర్థం చేసుకుందామా.., భ్రమల్లో విహరింపజేస్తున్న తీరును నమ్మి మునుగుదామా.. ఇక నిర్ణయం మనదే.
-రాజేంద్ర ప్రసాద్ చేలిక
99858 35601