కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి
ఆయూష్ ప్రభుత్వ వైద్యాధికారి శ్రీనివాస్
మేడ్చల్, డిసెంబర్26(నమస్తే తెలంగాణ): మొదటి, రెండో దశలో కొవిడ్ సోకిన వారికి ఒమిక్రాన్ ప్రభావం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మొదటి దశలో సోకిన వారికి ఇమ్యూనిటీ దెబ్బతిని ఉంటే తప్పా ఒమిక్రాన్ ప్రభావం అంతగా ఉండదని, రెండో దశలో కొవిడ్ సోకిన వారికి ఒమిక్రాన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు కొవిడ్ సోకని వారికి, వ్యాక్సినేషన్ (టీకాలు) తీసుకోని వారికి ఒమిక్రాన్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, వారి ఇమ్యూనిటీ బాగా ఉంటే ఒమిక్రాన్ సోకినా త్వరగా కోలుకుంటారని ఆయూష్ వైద్యాధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటి వరకు కొవిడ్ సోకని వారు వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ వచ్చినా రెండు రోజుల అలసట, పొడిదగ్గు, 101 డిగ్రీలు దాటని జర్వం వచ్చి తగ్గి పోతుందని, ఆందోళన చెంది, ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు.
ఒమిక్రాన్ బాధితులు బాగా అలసిపోయి ఉంటారని, కొద్దిపాటి కండరాల నొప్పి, గొంతులో గరగర, పొడిదగ్గు, జ్వరం ఉంటుందన్నారు. చికెన్ గున్యా లక్షణాలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలని సూచించారు. వారికి సోకింది ఒమిక్రాన్ లేదా చికెన్ గున్యా.. అనేది నిర్ధారించి వైద్యం అందిస్తారు. ఎప్పటికప్పుడు ఆక్సిమీటర్ సహాయంతో ఆక్సిజన్ శాతం పరిశీలించుకోవాలని, 94 శాతంపైన ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానంగా కడుపును ఖాళీగా ఉంచవద్దని, గంటకు పైగా ఉదయం సూర్య రశ్మిని ఆస్వాదించాలన్నారు. రోజుకు నాలుగు లీటర్ల నీరు, సీ విటమన్ లభించే పండ్లను అధికంగా తీసుకోవాలని వైద్యాధికారి శ్రీనివాస్ సూచించారు.