అబిడ్స్, జనవరి 2: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. అబిడ్స్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు కథనం ప్రకారం….నాగోలులో నివాసముండే రిటైర్డ్ ఉద్యోగి దుర్గం రాజం(85) ఆదివారం మధ్యాహ్నం మొజాంజాహి మార్కెట్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా, కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంతో ఢీకొట్టింది. తీవ్రగాయాలతో రాజం అక్కడికక్కడే చనిపోయాడు. బస్సు డ్రైవర్ వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
నిర్లక్ష్యంగా నడిపి..ప్రాణం తీసి..
ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజేంద్రనగర్ ఎస్ఐ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం… కిస్మత్పూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(45) ఆదివారం ఉదయం పిల్లర్ నంబర్ .195 వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా, జుమాటోలో పార్సిల్ బాయ్‌గా పనిచేస్తున్న వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి.. ఢీకొట్టాడు. ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కాగా, మృతుడికి కూతురు ఉంది. భార్య ఇటీవలే చనిపోయిందని పోలీసులు తెలిపారు.