హైదరాబాద్ సిటీబ్యూరో/చార్మినార్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పాతబస్తీ సౌత్‌వెస్ట్ జోన్లో… కబేళా, సబ్జీ మండీలు ఎక్కువగా ఉండే ఏరియాలో అతనొక ఇన్స్పెక్టర్. తన స్టేషన్లో నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి వసూలుకు పాల్పడుతున్నారు. దుకాణదారులు, కాలనీ సంఘాలు ముడుపులు చెల్లించుకోకుంటే కేసులు, వేధింపులు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు పట్టుకుని వస్తే.. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, ఒక రేటు ఫిక్స్ చేస్తారని, పైసలివ్వకుంటే కేసు నమోదు చేయరని తెలిసింది. ఒక్కో నోటీసుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
ఇటీవల సీసీ కెమెరాల ఏర్పాటు కోసమని బుకాయిస్తూ విద్యాసంస్థలు, దవాఖానలు, బార్లు, అండ్రెస్టారెంట్లు, సట్టాగ్యాంగ్లు, బెల్ట్‌షాపుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేశారని తెలిసింది. కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. పోలీసు కమిషనరేట్‌లోని ఓ గాడ్‌ఫాదర్ సహకారంతోనే సదరు సీఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఐస్ అనే సీసీ కెమెరాల నెట్వర్క్ పటిష్టత బృందాలను ఏర్పాటులో ప్రజలు భాగస్వాములు కావాలంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ గురువారం పిలుపునిచ్చారు. కానీ కొందరు అధికారులు మాత్రం సీసీ కెమెరాల పేరుతో అక్రమ వసూలుకు పాల్పడటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రెండు నెలల క్రితం హైదరాబాద్ సౌత్జోన్లో జరిగిన ఓ వివాహ బరాత్‌లో నలుగురు యువకులు కత్తులు తిప్పుతూ హల్చల్ చేశారు. ఆ వీడియోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఆదేశించడంతో స్థానిక ఇన్స్పెక్టర్ ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు నుంచి బయట పడేసేందుకు నిందితులతో ఒప్పందం చేసుకున్నారు. వీరిని బయటపడేసేందుకు కేసులో ఇతరులను ఇరికించినట్టు సమాచారం. ఇందుకు రూ.2.5 లక్షలు లంచం తీసుకున్నారని, ఆ నలుగురిని తరచుగా పిల్చుకుని సొంత పనులు చేయించుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది.
నేరాలను అదుపు చేయాల్సిన సీఐ.. నేరస్థులకు కొమ్ముకాస్తున్నారు. నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. సట్టా, గ్యాంబ్లింగ్ తదితర అక్రమ దందాలు నిర్వహిస్తున్న ముఠాల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని స్టేషన్ సిబ్బందే చెప్తున్నారు. ఇటీవల రాత్రిపూట సట్టా ఆడుతున్నట్టుగా స్టేషన్‌కు సమాచారం అందింది. సిబ్బంది వెళ్లి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సట్టా నిర్వాహకులను స్టేషన్‌కు పట్టుకొచ్చారు.
ఇన్స్పెక్టర్ మాత్రం సట్టా గ్యాంగ్‌కు వత్తాసు పలుకుతూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, సెల్ఫోన్లు వాపస్ ఇచ్చి, ముఠాను వెనక్కి పంపించినట్టు స్టేషన్ వద్ద చర్చ జరిగింది. ఇలా చెప్పుకుంటూపోతే సదరు రౌడీ ఇన్స్పెక్టర్పై గతంలోనూ చాలా ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది. మహిళా కానిస్టేబుళ్లను వేధించిన వ్యవహారంలో అతనిని బదిలీ చేశారని, ఆ తర్వాత కూడా బుద్ధి మార్చుకోలేదని ఆయనతో పనిచేసినవాళ్లు చెప్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారిపై సీపీ సజ్జనార్ చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలను పరిరక్షించాలని, పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.