హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ బో ధన దవాఖానలలో ఆరు రకాల స్పెషాలిటీ సేవలు అందించేందుకు 1,320 మంది సీనియర్ రెసిడెంట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ సారి 124 యూపీహెచ్‌సీల్లోనూ వీరి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సెలింగ్ ముగియగానే పోస్టింగ్‌ల కోసం పైరవీలు మొదలైనట్టు తెలుస్తున్నది. పీజీ (ఎండీ, ఎంఎస్) పూర్తి చేసిన సీనియర్ రెసిడెంట్లు మెడికల్ పీజీలో చేరేటప్పుడు వారి కోర్సు ముగిసిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ఏడాదిపాటు విధిగా సేవలు అందిస్తామని బాండ్ సమర్పిస్తారు.
ఆ మేరకు డీఎంఈ ఆధీనంలోని మెడికల్ కాలేజీలతోపాటు ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం యూపీహెచ్‌సీల్లో ఏడాదిపాటు సీనియర్ రెసిడెంట్లుగా హోదా కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూపీహెచ్‌సీల్లో మెరిట్ ప్రాతిపాదికన కౌన్సెలింగ్ నిర్వహించి, పోస్టింగ్ నిర్ణయిస్తారు. కానీ, కౌన్సెలింగ్ ముగియగానే కొందరు సిఫారసు లేఖలతో రంగంలోకి దిగగా.. మరికొందరు డబ్బులు పట్టుకుని సిద్ధమైనట్టు తెలిసింది.