సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ని మేకర్స్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్లో హీరోహీరోయిన్ల చేతులు ఒక గన్ పట్టుకుని ఉండటం విశేషం.. రొమాన్స్, యాక్షన్ మేళవింపుగా సినిమా ఉంటుందని పోస్టర్ చెబుతున్నది. తిరుమల ఆలయం, ప్రశాంతమైన శేషాచలం కొండలు ఈ పోస్టర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
రెండు జీవితాలు ఒక ప్రయాణం.. రెండు చేతులు ఒక ప్రామిస్.. రెండు మనసులు ఒక విధి.. అనే పదాలు కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాషా తడాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అజయ్ భూపతి దర్శకుడు. సి.కిరణ్ నిర్మాత. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పకుడు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.