హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో పామాయిల్ గెలల రవాణాలో అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ చెలికాని సత్యంబాబు కాంట్రాక్టును రద్దు చేసినట్టు టీజీ ఆయిల్‌ఫెడ్ జీఎం టీ సుధాకర్‌రెడ్డి శనివారం ప్రకటించారు. సకాలంలో కాంటా తూకం వేయకపోవడం, తరుగు తీయడం, తన సొంత పొలాల నుంచి అక్రమంగా అధిక గెలలను రవాణా చేయడం వంటి కారణాలతో రైతుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు.
అంతేకాకుండా సేకరించిన గెలలను 2 నుంచి 4 రోజుల పాటు నిల్వ ఉంచడం వల్ల (ఎఫ్ఎఫ్ఏ) శాతం పెరిగి అటు ఆయిల్‌ఫెడ్, ఇటు రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. యాజమాన్యం పలుమార్లు హెచ్చరించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని జీఎం సుధాకర్‌రెడ్డి తెలిపారు. కాంట్రాక్ట్ రద్దు నేపథ్యంలో కఠిన నిబంధనలతో నూతన ఈ-టెండర్ల ప్రక్రియ చేపడుతున్నట్టు స్పష్టం చేశారు.