హైదరాబాద్, సెప్టెంబర్26 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం బరాజ్లైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ పనులను నవంబర్ నాటికి చేపట్టాలని, వచ్చే వానకాలానికి ముందే ఆ పనులు పూర్తిచేయాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ కుందన్‌బాగ్‌లోని క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ పనుల పురోగతి గురించి శాఖ కార్యదర్శి శ్రీధర్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, ఈఎన్సీలు రమేశ్‌బాబు, శ్రీనివాస్, మధుసూదన్‌ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక అంశాలపై చర్చించారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పునరుద్ధరణ పనుల డిజైన్లను సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ పరిశీలనకు పంపాలని, పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్లో డిజైన్లపై మాడల్ స్టడీస్ నిర్వహించాలని, ఎన్డీఎస్ఏ, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గ్రౌటింగ్ ద్వారా బరాజ్‌ల పునాదులను బలోపేతం చేయడంతోపాటుగా, స్టిల్లింగ్ బేసిన్ల పొడిగింపు, కొత్త కట్-ఆఫ్ వాల్స్ నిర్మాణం, ఫౌండేషన్ స్థిరత్వంపై దృష్టి సారించాలని తెలిపారు. సాంకేతిక అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, అందుకు సంబంధించి వ్యయ అంచనాలను సిద్ధం చేయాలని శాఖ అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులు పూర్తయి భద్రతా అనుమతులు వచ్చాకే బరాజ్‌లను నిర్వహిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.