జనగామ, మే 31 (నమస్తే తెలంగాణ) : ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి తెగబడుతున్నారు. ఏ సర్వీస్‌కు ఎంత? అనే బోర్డులు సెంటర్లలో లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. తమ అవసరం కావడంతో ప్రజలు సైతం అడిగినంత ఇచ్చేస్తున్నారు. లేదంటే రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆధార్ కార్డుల జారీ, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్ మార్పిడితోపాటు బయోమెట్రిక్ అప్డేషన్ వంటి సేవలను పొందేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆధార్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వీటి కోసం ప్రజలు చెల్లించాల్సిన ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే సెంటర్ల నిర్వాహకులు వాటికి అదనంగా రూ. 50 నుంచి రూ. 100, అంతకు మించి వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఈ-కేవైసీ ప్రక్రియను అమలు చేయడంతో కార్డులోని ప్రతి ఒక్కరికీ ఆధార్ అప్డేట్ చేయించుకోవడం తప్పనిసరి కావడంతో కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా ఆధార్ సెంటర్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మార్చుకున్న నిర్వాహకులు ప్రతి ఆధార్ కార్డుదారుడి వద్ద అదనంగా రూ. 100 వసూలు చేస్తున్నారు. ఒక్క రేషన్ కార్డులో ఐదుగురు సభ్యులుంటే రూ.500 సమర్పించుకోవాల్సి వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు.
ఆధార్ కేంద్రాల దోపిడీపై దృష్టి సారించాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఒకవేళ వచ్చినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైనా అవసరం కోసం ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చాలంటే వేలల్లో సమర్పించుకోవాల్సిందే. సంబంధిత పత్రాలు లేకుంటే రూ.3 వేల నుంచి రూ. 5 వేల వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జనగామతో పాటు ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో దోపిడీ విపరీతమైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపు కార్డు ఉండాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర సర్కార్ ఆధార్ కార్డులను తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపట్టడంతో ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుపై ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. 2014లో తెలంగాణ ఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్‌ను మార్చుకోవడం అనివార్యమైంది. దీనికోసం ప్రతి ఒక్కరూ ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. తెలంగాణగా మార్చినందుకు కూడా నిర్వాహకులు రూ. 100 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే రాష్ట్రం పేరు మార్చుకోవడం తప్పనిసరైనందున ఆధార్ కేంద్రాల్లో ఉచితంగా ఈ సేవను అందించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, ఆన్‌లైన్‌లోనూ ఆధార్‌లోని అడ్రస్, గార్డియన్ (తండ్రి, భర్త) పేరు మార్చుకోవడం వంటి సేవలను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ వరకు ఉచితంగా అందిస్తున్నది. ఈ విషయం తెలియక చాలా మంది ఆధార్ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 1 నుంచి ‘మీ సేవ’ చార్జీలను భారీగా పెంచి సామాన్యులపై అదనపు భారం మోపింది. ప్రతి సర్వీసుపై 90 శాతం వరకు పెంచడంతో అన్ని వర్గాలపై ప్రభావం చూపుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 624కు పైగా ఉన్న మీ సేవ కేంద్రాల ద్వారా 350 రకాలకు పైగా సర్వీసులు అందుతున్నాయి. ఇందులో కులం, ఆదాయం, నివాసం ధ్రువపత్రాల కోసం ప్రతి నెలా సుమారు 8 నుంచి 10 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వ పథకాలు, భూముల రికార్డులు, విద్యార్ధుల ఇతర ధ్రువపత్రాలు తదితరాలన్నీ మీ సేవ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. అయితే గతంలో ఒక్కో ధ్రువపత్రానికి రూ.45 వసూలు చేయగా, తాజాగా ప్రభుత్వం రూ.35 అదనంగా పెంచడంతో అది కాస్తా రూ.80కి చేరింది. విద్యుత్ చార్జీ, ఈ కేవైసీ వంటి సేవలకు రూ.35 ఉన్న చార్జీలను కూడా 90శాతం అదనంగా అంటే రూ.62కు పెంచారు. కొందరు కేంద్రాల నిర్వాహకులు అధికారిక చార్జీలు కాకుండా అదనంగా మరో రూ.20 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.