జహీరాబాద్, జనవరి 21 : జహీరాబాద్ పట్టణ నడిఒడ్డున ఉన్న పాలశీతలీకరణ కేంద్రానికి చెందిన రూ. 50 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైంది. భూమిని కాపాడాలని సంబంధిత అధికారులు, పాల ఉత్పత్తిదారుల సంఘం నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. జిల్లా అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులెవ్వరు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 1973లో సర్వే నంబర్ 147లో పాలశీతలీకరణ కేంద్రానికి 3.20 ఎకరాల భూమిని కేటాయించారు.
పాలశీతలీకరణ కేంద్రం భూమి తనదంటూ ఈనెల 8న జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి రాత్రికి రాత్రే ఎకరానికి పైగా అక్రమంగా ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు. దీనిపై పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్, పాల ఉత్పతిదారుల సంక్షేమ సంఘం నాయకులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 13 రోజులు అవుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సర్వేచేసి ఆ భూమిని కాపాడాల్సిన అధికారులు మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా రెండుసార్లు ఇలాగే ఆ వ్యక్తే ఈ భూమిని కబ్జాకు పాల్పడితే అప్పట్లో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని భూమిని కాపాడారు. మళ్లీ సదరు వ్యక్తి భూమిని కబ్జా చేశారు.
ఈ విషయాన్ని జహీరాబాద్ తహసీల్దార్ దశరథ్ దృష్టికి ‘నమస్తే తెలంగాణ’ తీసుకెళ్ల్లగా.. పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని భూమికి ఫెన్సింగ్ వేసిన సదరు వ్యక్తి ఇది వరకే భూమిని సర్వే చేయాలని దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ భూమిని ఏడీ సర్వే చేసి ఇవ్వడంతో సదరు వ్యక్తి ఫెన్సింగ్ వేసుకున్నాడన్నారు. పాలశీతలీకరణ కేంద్రానికి కేటాయించిన భూమి లో పక్కనే ఉన్న ప్రభుత్వ దవాఖాన, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిధిలో కొంత ఉందన్నారు. పాలశీతలీకరణ కేంద్రానికి కేటాయించిన భూమి కబ్జా గురైనట్లు అనుమానాలు ఉంటే, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్, పాల ఉత్పతిదారుల సంక్షేమ సంఘం నాయకులు దరఖాస్తు చేస్తే, సర్వేచేసి భూమి అప్పగిస్తామని తహసీల్దార్ దశరథ్ తెలిపారు.