కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య అనుసంధానకర్తగా గవర్నర్ పదవిని రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారు. సమాఖ్య వ్యవస్థలో పొరపొచ్చాలు రాకుండా, అరాచకత్వం వ్యాపించకుండా చూసేందుకు దానిని రాజ్యాంగ పదవిగా తీర్చిదిద్దారు. ఆ పదవి నిర్వహణలో నిష్పాక్షికత కోసం రాజకీయాల నుంచి వైదొలగిన వారిని లేదా రాజకీయేతర రంగాలకు చెందిన ప్రముఖులను నియమించే సంప్రదాయం అప్పటి దేశ పెద్దలు ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రానంతర కాలంలో విలువలు క్రమంగా వీగిపోయినట్టుగానే గవర్నర్ల వ్యవస్థ కూడా దిగజారింది. విపక్ష పాలనలో ఉన్న రాష్ర్టాల్లోని ప్రభుత్వాలను సతాయించేందుకు సాధనాలుగా గవర్నర్లు మారారు. సమాఖ్య స్ఫూర్తికి సవాలుగా తయారయ్యారు.
తమిళనాడు, కేరళ గవర్నర్ల వ్యవహారాలు ఈ అనాచారానికి తాజా ఉదాహరణలు మాత్రమే. తమిళనాడు గవర్నర్ చదవాల్సిన ప్రసంగ పాఠం చదవలేదు. కేరళ గవర్నర్ ప్రసంగంలో లేని అంశాలను చదివేశారు. రెండూ కూడా అధికార పరిధిని అతిక్రమించి, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను తోసిరాజనే చర్యలే అని చెప్పక తప్పదు. రెండు దక్షిణాది రాష్ర్టాల్లో కాలుమోపే అవకాశం కోసం బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు గవర్నర్ల ప్రవర్తన ప్రభుత్వాల పట్ల వేధింపులుగా కనిపించడంలో విడ్డూరం ఏమీ లేదు.
గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేయడం అనేది కాంగ్రెస్ హయాంలో మొదలైతే బీజేపీ పాలనలో పరాకాష్టకు చేరుకున్నది. గవర్నర్ పదవిలో రాష్ర్టానికి రాజ్యాంగాధినేత, కేంద్రం ప్రతినిధి అనే రెండు పార్శ్వాలుంటాయి. ఈ ద్వంద్వ నిర్వచనమే సమస్యలు తెచ్చిపెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు గవర్నర్లు వ్యవహరించాలని రాజ్యాంగం నొక్కిచెప్పింది. అయినప్పటికీ కొందరు గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
కేరళలో ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నివేదికనే ఉపయోగించుకున్నది. ఉమ్మడి ఏపీలో సీఎం పదవి నుంచి ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేసిన గవర్నర్ రాంలాల్ ఉదంతం పెద్ద అలజడికి దారితీసింది. తర్వాత గవర్నర్ కుముద్‌బెన్ జోషీ చుట్టూ వివాదాలు అల్లుకున్న సంగతీ తెలిసిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇబ్బందులు పెట్టడం ఇంకా ఇక్కడి ప్రజలు మరచిపోలేదు. క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగని వ్యక్తులను గవర్నర్లుగా నియమిస్తే ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయనడానికి ఆమె పదవీకాలం ఓ ఉదాహరణగా నిలిచింది.
కాంగ్రెస్ కన్నా రెండాకులు ఎక్కువే చదివిన బీజేపీ పూర్తిస్థాయిలో గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను గవర్నర్లు తొక్కిపెట్టడం, నియామకాలకు ఆమోదం నిరంతరంగా వాయిదా వేయడం వంటివి బీజేపీ హయాం లో సర్వసాధారణమైపోయాయి. విపక్ష పాలిత రాష్ర్టాల్లో గవర్నర్ల జోక్యం తరచుగా వార్తలకెక్కుతుండటం మనం చూస్తున్నాం. బెంగాల్లో గవర్నర్ ధన్‌ఖడ్, కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అడుగడుగునా అడ్డుపుల్లలు వేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ వివాదాలపై సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి.
గవర్నర్ల దగ్గర పెండింగులో ఉన్న బిల్లుల గడువు మూడు నెలలు దాటితే అవి ఆమోదం పొందినట్టుగా భావించాలని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల సంచలన నిర్ణయం ప్రకటించినప్పటికీ తదుపరి దానిని ఉపసంహరించుకోవడం గమనార్హం. తమిళనాడు, కేరళ గవర్నర్ల వివాదాల నేపథ్యంలో మరోసారి గవర్నర్ వ్యవస్థ సంస్కరణపైకి దేశ ప్రజల దృష్టి సహజంగానే మళ్లింది. గవర్నర్ వ్యవస్థ సంస్కరణలపై సర్కారియా కమిషన్ సిపారసులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు అమలులోకి వస్తాయని అనుకోవడానికి లేదు. గవర్నర్‌గిరీ రుచి మరిగిన బీజేపీ ఇప్పట్లో వ్యవస్థాపరమైన మార్పులు తెస్తుందని భావించడం అత్యాశే అవుతుంది. అయితే తీవ్ర పర్యవసానాలకు దారితీసే విధంగా తెగేదాకా లాగకపోవడం సమాఖ్యస్ఫూర్తికి మంచిదని మాత్రం చెప్పక తప్పదు.