మంచిర్యాల టౌన్, మే 2 : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్-2026)ను ఈ నెల 3న నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటికే సమావేశమైన అధికారులు, శనివారం ఇన్విజిలేటర్లకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించనుండగా, బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో అభ్యర్థులను ఉదయం 11.30 గంటల నుంచే పరీక్షా కేంద్రం లోనికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
మంచిర్యాలలో నాలుగు కేంద్రాలు
నీట్ పరీక్ష కోసం మంచిర్యాలలో నాలుగు కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. పరీక్షకు 1144 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మంచిర్యాల పట్టణం రాజీవ్‌నగర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్లో 384 మంది అభ్యర్థులు, బస్టాండు పక్కన ఉన్న జడ్పీ బాలుర పాఠశాలలో 288 మంది, మార్కెట్ ఏరియాలో ఉన్న జడ్పీ బాలికల పాఠశాలలో 240 మంది, కాలేజీరోడ్‌లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 232 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం, 163 సెక్షన్ అమలు చేయడంలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్, ఏదైనా ఒరిజనల్ గుర్తింపు కార్డు, ఇటీవలే దిగిన రెండు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు, 4/6 కలర్ ఫొటోను తీసుకురావాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్‌లు, ఆభరణాలు, నీళ్లసీసాలు, తిను పదార్థాలు అనుమతించరు.
నీట్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు
రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 2 : నీట్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేయనున్నట్లు తెలిపారు. మంచిర్యాల జోన్లో తెలంగాణ మోడల్ సూల్ అండ్ జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ హైసూల్ (బాలుర), జిల్లా పరిషత్ హైసూల్ (బాలికలు), ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.