Ramayanam | మొదట్లో నాకు సిటీ తెలియదని, ఇబ్బంది పడతానేమోనని నేను మా ఊరికి పోయేటప్పుడు.. రంగారావు చిన్నాయన సికింద్రాబాద్ దాకా వచ్చి రైలు ఎక్కించేవారు. ఆ తరువాత నేనే పొద్దున అయిదు గంటలకు నారాయణగూడలో బయల్దేరి ఆటోలో సికింద్రాబాద్ వెళ్లి, ఆరున్నరకు ఉండే ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేదాన్ని.
అ ది గంటకు పదిసార్లు స్టేషను ఉన్న చోటా, లేని చోటా ఆగుతూ.. ఎక్స్ప్రెస్సులకు మర్యాద చూపించి క్రాసింగుల పేరిట గంటలు గంటలు ఆగుతూ ఎప్పటికో సాయంత్రం నాలుగ్గంటలకు ఘన్పూర్ చేరేది. ఓసారి..
“ఊరికి పోవాల్నంటే నేనొక్కదాన్ని జర్నీ చెయ్యలేనే రమా! ఈసారి నువ్వు పొయ్యేటప్పుడు నేనొస్త!” అన్నది వకుళక్క. పొద్దున్నే ఆటోలో వాళ్ల గల్లీకి వెళ్లి తనను పికప్ చేసుకుని ఇద్దరం కలిసి సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లాం. అప్పటికే అక్కడ రెండు మూడు మెలికలు తిరిగిన పెద్ద క్యూ ఉంది. చేసేదేం లేక ఆ లైన్లో చివర చేరాను. నా పక్కన వకుళక్క నిలబడింది. చూస్తుండగానే మా వెనక ఇంకా చాలామంది చేరారు. లైను మెల్లగా కదులుతున్నది.
ట్రైన్ టైం అవుతున్నకొద్దీ వెనకున్న వాళ్లకు టెన్షన్ పెరిగి పోతున్నట్టుంది. ఆరాటాలు, విసుగులు, నిట్టూర్పులు ఎక్కువయ్యాయి. “నేను టాయిలెట్‌కు పొయ్యి ఒస్తనే!” అంటూ వకుళక్క చెప్పింది. “తొందరగ రా మరి!” అన్నాను. వకుళక్క మళ్లీ వచ్చేటప్పుడు వెంట ఓ యువకుడు చేతిలోనిదేదో చూపిస్తూ మాట్లాడుతూ నడుస్తున్నాడు. తను కొంచెం ఆసక్తి లేనట్టుగా అప్రియంగా మొహం పెట్టి నడుస్తోంది వకుళక్క.
లైను కొంచెం కదిలింది తప్ప పెద్ద తేడా లేదు. మావంతు వచ్చేటప్పటికి ఇంకో ఇరవై నిముషాలన్నా పట్టేటట్టుంది. వకుళక్క వచ్చేసింది. అతను కూడా వచ్చాడు. “రమా! చూడవే.. టిక్కెట్లు కొనమని సతాయిస్తున్నడు..” చెప్పింది వకుళక్క. ఏమైందని నేను అడిగేలోగానే ఆ యువకుడు.. “మా అక్క దగ్గరికి కాజీపేటకు పోవాల్నని నేను, మా అమ్మ రెండు టిక్కెట్లు కొనుక్కున్నం. ఇంతలకు మా తాత చచ్చిపోయిండని ఇప్పుడే మా అన్న బండి ఏస్కోని ఇక్కడికి ఒచ్చి చెప్పిండు.
ఈ టిక్కెట్లు ఎనుకకు ఇయ్యాల్నంటే రెండు గంటలైతదట. మీకు గావాల్నంటే తీసుకోని నాకు పైసలియ్యండి” అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. “నన్నడిగితే ‘మీ టిక్కెట్లు మాకెందుకు? మేం కొనుక్కుంటం గదా, అయినా గూడా నిన్ను అడిగి చెప్తా’ అన్ననే” అంది వకుళక్క. “మీకు టిక్కెట్లు దొరికేవరకు ట్రైను ఒస్తది. అది థర్డ్ ప్లాట్‌ఫాం మీదికి ఒస్తది. మీరు మెట్లెక్కి అవుతలికి దిగి పొయ్యేవరకు ఆగమాగం అయితరు. నా దగ్గర తీసుకుంటె నాకు నయం, మీకు నయం. మెల్లగ పొయ్యి రైల్ల కూచోవచ్చు” అన్నాడతను నాకు టిక్కెట్లు చూపించి వివరిస్తూ. ఆ రెండు టిక్కెట్లు చూసాను. సికింద్రాబాద్ నుంచి కాజీపేట దాకా ఉన్నాయి. అయినా సరే.. వెంటనే ఒప్పుకోవద్దు కదా!
“మాకే ఎందుకు ఇస్తున్నరు? ఇక్కడ ఇంతమంది ఉన్నరు గద! అయినా గూడా ఇవ్వి కాజీపేట దాంక ఉన్నయి. మేము ఘన్పూర్ దాంకనే పోవాలె. ఎవరన్న కాజీపేటకు పొయ్యెటోళ్లకు ఇయ్యండి” అన్నాను నేను, చాలా తెలివిగా మాట్లాడాను అనుకుంటూ.
“నాకు మీరు టికట్ పైసలు ఘన్పూర్ దాంక ఎంత అయితదో గన్నే ఇయ్యండి. నేను ఎక్వ అడుగుతలేను. మీరు ఆడిపిల్లలు గాబట్టి ట్రైన్ల ఉరుక్కుంటు ఎక్కలేరని మీకు ఇస్తున్న. మీకు డౌటుంటే అగో.. మా అమ్మ గక్కడ కూచుంది, చూడండి” అన్నాడు. నిజంగానే అక్కడ పిల్లర్ దగ్గరున్న రౌండ్ బెంచీ మీద ఒక నడివయసావిడ సంచీ పట్టుకుని కూచుంది.
వకుళక్క వైపు చూసాను.. ఏం చేద్దామన్నట్టుగా. “నీ ఇష్టం!” అన్నది మెల్లగా. కొందరు అస్సలు కమిట్ కారు. “సరే.. ఇవ్వండి!” అని నేను డబ్బులిచ్చి టికెట్లు తీసుకున్నాను. కాసేపటికే రైల్ వచ్చింది. చెరో చోటా సీటు దొరికితే ఎవర్నో బతిలాడి ఒక దగ్గరే సర్దుకుని కూర్చున్నాం. పుస్తకం పట్టుకుని అందులో మునిగిపోయాను. ఆలేరు వస్తుండగా టీటీ వచ్చినట్టున్నాడు. అడగ్గానే బ్యాగులోంచి టికెట్లు తీసి ఇచ్చాను. ఆయన వెంటనే సంతకం పెట్టి ఇవ్వకుండా వాటిని వెనక్కీ ముందుకూ, పరిశీలనగా చూసి.. “అమ్మాయీ! ఈ టిక్కెట్లు ఎప్పుడు కొన్నారు?!”
అనడిగాడు. “ఇవ్వాళే!” అని చెప్పాను. “ఎక్కడ కొన్నారు?!” మరో ప్రశ్న. “సికింద్రాబాద్ స్టేషన్ల!”.. నాకెందుకో భయమేసింది. అందరూ మా వైపే చూస్తున్నారు. “వీటిని కౌంటర్లోనే కొన్నారామ్మా?!” మళ్లీ అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. వకుళక్క ఏమీ మాట్లాడలేదు. “ఎవడో మీకు బాగా టోపీ వేసాడమ్మా?! ఈ టిక్కెట్లు వారం కిందివి. అప్పుడప్పుడూ స్టేషన్లో ప్యాసింజర్లు దిగాక.. గేటు దగ్గర టికెట్ కలెక్ట్ చేసేవాళ్లు లేకపోతే అలాగే జేబులో పెట్టుకుని వెళ్తుంటారు. అలాంటి టికెట్లివి. మీకు అమ్మాడు. ఇలా కౌంటర్ బయట ఎవ్వరు ఇచ్చినా కొనొద్దమ్మా!”
అన్నాడాయన. ఆ టీటీ మా దగ్గర ఇంకా టికెట్లకు సరిపడా డబ్బుందా? అనడిగితే మా ఇద్దరి దగ్గరా ఉన్నదంతా కలిపి ఇచ్చేసాం. నిజానికి మమ్మల్ని నెక్ట్స్ స్టేషన్లో దింపాల్సి ఉంది కానీ, మా మొహాలు చూసి ఆగానన్నాడు. “మమ్ములను ఘన్‌పూర్‌ల దింపండి సార్! అక్కడ ఎవరినన్న అడిగి ఇస్తాం సార్! మా నాన మళ్లా వాళ్లకు ఇచ్చేస్తడు” అని చెపుతుంటేనే.. నా కళ్లల్లోకి నీళ్లు పొంగి వచ్చాయి. కొందరు తక్కువబడ్డ మొత్తం ఇస్తామని ముందుకొచ్చారు.
“అయ్యో! ఏడ్వకమ్మా!” అంటూ ఆయన ఎవరి సహాయం తీసుకోకుండానే మాకు నియరెస్ట్ స్టేషన్ నుంచి టికెట్లు ఇచ్చాడు. థాంక్స్ చెప్పి ఘన్‌పూర్‌లో దిగాం. టీటీ కూడా దిగి స్టేషన్ మాస్టర్‌కి ఇలా అపరిచితుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనే బోర్డు పెట్టమని విషయం చెప్పారు. “వాళ్ల నాన్నగారు నాకు తెలుసండీ! చాలా మంచాయన” అన్నారు స్టేషన్ మాస్టర్. “నాకెందుకో ముందే డౌట్ ఒచ్చిందే!” అన్నది వకుళక్క. ‘మరి ఎందుకు వద్దనలేదు’ అని నేనడగలేదు. ఇంటికెళ్లాక ఆ విషయం మీద రెండు రోజులపాటు సెమినార్ నడిచింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి