OMC Case | అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో ఐదుగుర్ని దోషులుగా తేల్చింది. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన ఓఎంసీ కంపెనీ, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వీడీ రాజగోపాల్, కె.మెఫజ్ అలీఖాన్‌ను దోషులుగా తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే ఒక లక్ష రూపాయల జరిమానా విధించింది. 2004-09 మధ్యలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, అప్పగి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందాన్ని నిర్దోషులుగా ప్రకటించింది. ఇక ఈ కేసు నుంచి ఐఏఎస్ శ్రీలక్ష్మీని 2022లోనే సీబీఐ కోర్టు డిశ్చార్జి చేసింది.
ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చింది. మొత్తంగా ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది. ఏ1గా బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2గా గాలి జనార్దన్ రెడ్డి, ఏ3గా గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, ఏ4గా ఓఎంసీ మైనింగ్ కంపెనీ, ఏ5గా లింగారెడ్డి, ఏ6 ఐఏఎస్ శ్రీలక్ష్మీ, ఏ7గా మెఫజ్ అలీఖాన్, ఏ8గా మాజీ ఐఏఎస్ కృపానందం, ఏ9గా సబితా ఇంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టు 219 మంది సాక్షులను విచారించింది. 3400 పత్రాలను పరిశీలించింది.