మక్తల్ : నారాయణపేట కొడంగల్ ( Kodangal ) ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం చెల్లించేంతవరకు భూసేకరణ చేపట్టరాదని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న పాదయాత్రకు ( Farmers march ) పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజవర్గానికి చెందిన వందలాది మంది మక్తల్ మండలంలోని కాట్రేవపల్లి, ఎర్నాగానిపల్లి, కాచ్ వార్ గ్రామాల రైతులు మక్తల్ తహసీల్ కార్యాలయం వరకు పాదయాత్రను ప్రారంభించారు. జిల్లా భూ నిర్వాసితుల జిల్లా అధ్యక్షులు వెంకటరామిరెడ్డి అధ్యక్షతన ప్రారంభించిన పాదయాత్ర ను అనుమతుల పేరిట మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి అడ్డుకొని రైతులను ఇబ్బందులపాలు చేశారు.
పాదయాత్రకు నేషనల్ హైవే అథారిటీ అనుమతులు కావాలంటూ దాదాపు నాలుగు గంటల వరకు కచ్వార్ గ్రామం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చివరకు నారాయణపేట డీఎస్పీ లింగయ్య ఆంక్షాలతో అనుమతి ఇవ్వడంతో పాదయాత్ర కొనసాగింది.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Former MLA Chittem Rammohan Reddy ) పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని, భూముల బేసిక్ ధరను నిర్ణయించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి డీపీఆర్, అనుమతులు లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగమేఘాలపై రైతుల వద్ద భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న శ్రీహరి నియోజకవర్గంలో రైతులకు కొడంగల్ మాదిరిగా పరిహారం ఎందుకు ఇప్పిస్తాలేరో బహిర్గత పరచాలన్నారు. రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ బలవంతంగా భూసేకరణ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ అండగా ఉండడంతోపాటు, రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రైతులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర భూ నిర్వాసితుల కార్యదర్శి కిలే గోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజుల ఆశి రెడ్డి, నాయకులు అన్వర్ హుస్సేన్, నరసింహారెడ్డి, తరుణ్, షమీ, సాగర్, రైతులు రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేశవులు, శివ, తదితరులు ఉన్నారు.