భోపాల్ : ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ను డిమాండ్ చేస్తూ ఓబీసీ మహాసభ ఇచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీసీ కోటాతో ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపధ్యంలో ఓబీసీలు శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఓబీసీలకు కేవలం 14 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని ఓబీసీ మహాసభ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వారి పోరాటానికి తాము మద్దతు తెలుపుతున్నామని మాజీ సీఎం కమల్ నాధ్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగా బీసీలున్నారని, జనాభాకు తగినట్టుగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. కాగా సుప్రీం తీర్పును సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమర్ధించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. ఓబీసీల కోటా 27 శాతం నుంచి 14 శాతానికి తగ్గడం సిగ్గుచేటని అన్నారు. తమ హయాంలో ఓబీసీలకు 27 శాతం కోటా అమలైందని దిగ్విజయ్ సింగ్ గుర్తుచేశారు.