అగ్ర హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. తారక్ కెరీర్‌లోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమాను నిలుపుతానని ఆ మధ్య దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఓ భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. దానికి నిలబెట్టుకునేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఇన్సైడ్ టాక్. తాజా సమాచారం ప్రకారం ఇందులో ఎన్టీఆర్ రెండు గెటప్పుల్లో కనిపిస్తారట.
వాటిలో ఓల్డ్ గెటప్ కీలకమని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ గెటప్‌కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. దీనికోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ని కూడా నిర్మించారట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలైట్‌గా ఉంటుందని వినికిడి.
ఇప్పటివరకూ ప్రశాంత్‌నీల్ తీసిన సినిమాలన్నింటిలో బెస్ట్ మూవీ ఇదే అవుతుందని చిత్రబృందం చెబుతున్నది. మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ భారీ పానిండియా సినిమాకు రుక్మిణి వసంత్ కథానాయిక కాగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.