ముంబై, ఫిబ్రవరి 18: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) విలువ రూ.4.7 లక్షల కోట్లకు చేరిందని ఓ తాజా నివేదిక పేర్కొన్నది. దేశంలోని అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ వేదికల్లో ఒకటైన ఎన్ఎస్ఈ.. త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన, నమోదుకాని 500 భారీ సంస్థలతో బుర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా 2024కుగాను ఓ జాబితాను తీసుకొచ్చింది. ఇందులో గత ఏడాది ఎన్ఎస్ఈ విలువ ఏకంగా 201 శాతం పుంజుకున్నట్టు తేలింది. ఇక దేశంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఎన్ఎస్ఈ 10వ స్థానంలో ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఎన్ఎస్ఈ స్థూల ఆదాయం 28 శాతం పుంజుకొని రూ.16,352 కోట్లుగా నమోదైంది. పన్ను అనంతర లాభం 51 శాతం ఎగిసి రూ.8,306 కోట్లుగా ఉన్నది. కాగా, ఇటీవలే లిస్టింగ్ ప్రక్రియను మొదలుపెట్టిన ఎన్ఎస్ఈ.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దరఖాస్తు చేసుకున్నది. పబ్లిక్ ఇష్యూలో 10 శాతం వాటాలను విక్రయించే వీలున్నట్టు అంచనా.
రిలయన్స్ టాప్
రూ.17.5 లక్షల కోట్ల విలువతో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) హురున్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది. రూ.16.1 లక్షల కోట్లతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో స్థానంలో ఉండగా, 30 శాతం వృద్ధిని సాధించినట్టు హురున్ పేర్కొన్నది. గ్రూప్లవారీగా చూస్తే.. టాటా గ్రూప్ విలువ 37 శాతం వృద్ధితో రూ.32.27 లక్షల కోట్లుగా ఉన్నది. రిలయన్స్ గ్రూప్ రూ.19.71 లక్షల కోట్లుగా ఉంటే.. గౌతమ్ అదానీ గ్రూప్ విలువ రూ.13.40 లక్షల కోట్లుగా తేలింది. ఇక ఈసారి జాబితాలో చోటు దక్కించుకున్న 500 కంపెనీల్లో ప్రతీదాని విలువ బిలియన్ డాలర్లపైనే. ఈ మొత్తం కంపెనీల వాల్యూ కూడా 3.8 ట్రిలియన్ డాలర్లను తాకింది. రెవిన్యూ ట్రిలియన్ డాలర్లుగా ఉంటే.. లాభం రూ.8 లక్షల కోట్లుగా ఉన్నది. పన్నులు రూ.2.2 లక్షల కోట్లుగా ఉండగా.. ఉద్యోగులు 85 లక్షల మంది ఉన్నారు.