యాదాద్రి, మే 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో పూర్తయ్యాయి. మూడోరోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి అభిషేకం, పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం స్వామివారికి సహ స్ర ఘటాభిషేకం చేపట్టారు.
సాయంత్రం 7 గంటలకు ఆలయంలో అర్చకులు నృసింహ జయంతి వేడుకలు నిర్వహించి, నృసింహ ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్టితో ఉత్సవాలకు ముగింపు పలికారు. స్వామివారి దివ్యక్షేత్రంలో స్వాతి నక్షత్ర పూజలు అర్చకులు కోలాహలంగా నిర్వహించారు. ఆదివారం సెలవు కావడం తో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల కిటకిటలాడాయి. ప్రధానాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి.