మలిదశ ఉద్యమం ప్రారంభంలో ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు కీలక పాత్ర పోషించారు. 2009 నుంచి జరిగిన తుది దశ ఉద్యమంలో న్యాయవాదులు, వైద్యులు కూడా భారీగా పాల్గొని తమ వంతు పాత్రను పోషించారు.
ఉద్యమకాలంలో జేఏసీల నిర్మాణాల్లో భాగంగా న్యాయవాదుల ఐ.కా.సని ఎం.రాజేందర్‌రెడ్డి, పులిగారి గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఏర్పరిచారు. కేసీఆర్ దీక్షను అడ్డుకొని ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు ఆయనకు సంఘీభావం తెలుపుతూ న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టులో డిసెంబర్ 9 వరకు దీక్షలు చేశారు. డిసెంబర్ 23 ప్రకటనతో మరొకసారి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేశారు.
2010, జనవరి 5న న్యాయవాదులు తెలంగాణ సరిహద్దులోని రహదారులపై తెలంగాణేతర డ్రైవర్లకు వీసాలు జారీ చేశారు.
2010, జనవరి 20న న్యాయవాదులు తెలంగాణ బిల్లుని పెట్టాలని కోరుతూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు.
శ్రీకృష్ణ కమిటీ నియామకంతో తెలంగాణలో వెల్లువెత్తిన నిరసనల్లో న్యాయవాదులు కూడా భాగమయ్యారు. 2010, ఫిబ్రవరి 22న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 2000 మంది న్యాయవాదులు ధర్నా చేశారు. ఆ తర్వాత పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించి లాఠీ దెబ్బల పాలయ్యారు. ఈ సంఘటన జాతీయ స్థాయిలో తెలంగాణ అంశానికి ప్రచారం కల్పించింది.
తెలంగాణ న్యాయవాదులు న్యాయవ్యవస్థలోని వివక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అనేకసార్లు న్యాయస్థానాలను బహిష్కరించారు. న్యాయ వ్యవస్థలోని వివక్షను వివరిస్తూ శ్రీకృష్ణ కమిటీకి ఒక నివేదికను అందజేశారు.
తెలంగాణ జేఏసీ నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో న్యాయవాదులు పాల్గొని ఉద్యమాన్ని బలపరిచారు. 2011, మార్చిలో న్యాయవాది గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ‘తెలంగాణ న్యాయ సంగ్రామం’ అనే ఉద్యమ గీతాల సీడీని వెలువరించారు. తెలంగాణ ఏర్పాటును కోరుతూ దేవేందర్‌రెడ్డి అనే న్యాయవాది ఆత్మ బలిదానం చేసుకోవడం సంచలనం సృష్టించింది.
తెలంగాణ న్యాయవాదులు ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలపెట్టిన విద్యార్థి గర్జన సభకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పుడు న్యాయవాదుల కృషి వల్లనే ఆ సభకు షరతులతో కూడిన అనుమతి లభించింది. ఉద్యమకారులను, విద్యార్థులను అక్రమ కేసుల నుంచి బయటపడేందుకు ఉచిత బెయిల్ పిటిషన్లు వేశారు. ఎందరో ఉద్యమకారులకు ఉచిత న్యాయ సాయం చేశారు.
మలిదశ ఉద్యమంలో ముఖ్యంగా 2009 తర్వాత వైద్యులు కూడా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. డాక్టర్ బూర నర్సయ్య, సురేశ్‌చంద్ర, విజయ్‌భాస్కర్ తదితరులు ‘డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో సమీకృతమయ్యారు.
జేఏసీ రూపొందించిన అనేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యమ గమనంలో ప్రభుత్వ దమనకాండ వల్ల గాయాల పాలైన వారికి అనేక సందర్భాల్లో ఉచిత వైద్య సేవలు అందించారు. జేఏసీ పిలుపునందుకొని రైల్‌రోకో కార్యక్రమాల్లో భాగంగా బీబీనగర్ పట్టాలపై రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ తరఫున కొందరు వైద్యులు 10 జిల్లాల్లో 10 కార్లతో చేసిన పర్యటనకు విశేష స్పందన లభించింది. 2013, మే19న వికారాబాద్‌లో వైద్యుల శంఖారావం సభ జరిగింది. కోదండరాం ముఖ్య అతిథిగా వచ్చి తెలంగాణ బిల్లు తేవాలని, ఉద్యమకారులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
వైద్య విద్యార్థులు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010, జనవరి 22న ఓయూ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థి గర్జన విజయవంతంగా నిర్వహించారు. 2013లో కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థులు సభను నిర్వహించి తెలంగాణను డిమాండ్ చేశారు. ఐ.కా.స నిర్వహించిన అన్ని ఆందోళనల్లో వైద్య విద్యార్థులు కూడా చురుగ్గా పాల్గొన్నారు.
1990వ దశకంలో సమాచార సాంకేతిక విప్లవం కారణంగా ఎందరో తెలుగువారు అమెరికా తదితర దేశాల్లో ఉపాధి అవకాశాలను పొందారు. దీనివల్ల సీమాంధ్రులే ఎక్కువగా లాభపడినప్పటికీ కొందరు తెలంగాణ యువకులు కూడా అవకాశాలు పొందారు. అప్పటికే తెలంగాణకు చెందిన వృత్తి నిపుణులు, శ్రామికులు కూడా విదేశాల్లో స్థిరపడ్డారు.
ఎక్కడో దూరంగా నివసిస్తున్న తెలంగాణ బిడ్డలకు కూడా తెలంగాణ సమస్యల పట్ల ఆందోళన ఉంటూనే వచ్చింది. ఈ నేపథ్యంలో జయశంకర్ తదితరుల స్ఫూర్తితో మధు కె.రెడ్డి ‘తెలంగాణ డాట్ ఆర్గ్’ ద్వారా తెలంగాణ సమస్యలపై ప్రచారం కల్పించాడు. ఆయన మరికొందరు మిత్రులతో కలిసి 1999లో ‘తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం’ను స్థాపించాడు. క్రమంగా అమెరికాలోని 35 నగరాల్లో ఈ సంస్థకు శాఖలు ఏర్పడ్డాయి.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు 1999, 2004, 2009 ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తెలంగాణను బలపరిచే వారినే గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. తెలంగాణ సమస్యలపై దినపత్రికల్లో భారీ వ్యాపార ప్రకటనలు ఇచ్చారు. అలాగే లక్షల సంఖ్యలో లఘు పుస్తకాలను పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమంపై విష ప్రచారం చేస్తూ పరకాల ప్రభాకర్ ‘తెలంగాణ నూటొక్క అబద్ధాలు’ గ్రంథాన్ని ప్రచురించినప్పుడు కొంతం దిలీప్ ఆ గ్రంథాన్ని ఖండిస్తూ రచించిన ‘A Rebuttal to Vishalandras Gobels Propaganda’ ప్రచురించారు.
అమెరికాలో అమెరికా తెలుగు అసోసియేషన్ వారు కూడా ఉద్యమానికి సహకరించారు. 2000 సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ వారు జయశంకర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ బ్యాంక్వెట్ నైట్’ పేరుతో జరిగిన సమావేశంలో జయశంకర్ తెలంగాణపై చేసిన ప్రసంగంతో స్ఫూర్తి పొందిన ఎన్నారైలు అమెరికాలోని 15 నగరాల్లో జయశంకర్ ప్రసంగాలను ఏర్పాటు చేశారు.
2007లో ఏర్పడిన తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ వివిధ రంగాల్లో నిష్ణాతులైన తెలంగాణ వారికి పురస్కారాలను అందిస్తూ వచ్చారు. ఈ సంస్థవారు సకల జనుల సమ్మెకు మద్దతుగా 2011, అక్టోబర్ 15న వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన తెలంగాణ కవాతు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
ఏపీ పాలనలో కార్మికులు ఎన్నో ఇక్కట్లకు గురయ్యారు. నిజాం కాలం నాటి పారిశ్రామిక సంస్థలను మూసివేయడంతో ఎందరో కార్మికులు ఉపాధిని కోల్పోయారు. మరోపక్క సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అనేక సంస్థలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నాయి.
ఈ నేపథ్యంలోనే కార్మికులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలకు భద్రత లభిస్తుందని భావించారు. అందువల్లనే సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు.
సంఘటిత రంగంలోని సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్, మున్సిపల్ కార్మికులు ఉద్యమ గమనంలోని అనేక సందర్భాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఐ.కా.స పిలుపునందుకొని 2011, ఫిబ్రవరిలో మొదలైన సహాయ నిరాకరణోద్యమంలో వీరు కీలక పాత్ర పోషించారు. 2011, మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్‌లో కూడా సింగరేణి, ఆర్టీసీ కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
2011, సెప్టెంబర్‌లో మొదలైన సకల జనుల సమ్మె విజయవంతం అవడంలో ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ కార్మికుల పాత్ర ఉంది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ సింగరేణి కార్మికులు 35 రోజులు చేసిన సమ్మె వల్ల రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అలాగే ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన 27 రోజుల సమ్మె వల్ల రవాణా రంగం స్తంభించిపోయింది.
పాలక వర్గాల ఆర్థిక విధానాల వల్ల సరైన ఉపాధి అవకాశాలు లేని ఎందరో తెలంగాణ యువకులు అసంఘటిత రంగంలో మగ్గిపోయారు. బీడీ కార్మికులు, ఆటోరిక్షా డ్రైవర్లు, హోటల్ కార్మికులు, పేపర్ బాయ్‌లు తదితరులు ఎన్నో రకాల ఉపాధి అవకాశాలను వెతుక్కున్నారు.
ఉద్యమకారుల కృషి వల్ల తెలంగాణ ‘ధూం-ధాం’ కార్యక్రమాల వల్ల వీరిలో ఉద్యమ స్పృహ పెరిగింది. అందువల్లనే తెలంగాణ ఐ.కా.స నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని విజయవంతం చేశారు.
2010, మే 23న ‘తెలంగాణ ప్రైవేటు సెక్టార్ ఎంప్లాయీస్ జేఏసీ’ సుందరయ్య విజ్ఞాన మందిరంలో తెలంగాణ రాష్ట్ర సాధన సదస్సును నిర్వహించింది. అలాగే 2012, జూలై 19న ‘భూమి పుత్రుల’ పాదయాత్రను నిర్వహించి తెలంగాణలో అన్ని ఉద్యోగాల్లో తెలంగాణ వారికే అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసింది.
2009 తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నిజమైన ప్రజా ఉద్యమంగా మారడంలో కార్మికుల పాత్ర కీలకమైందని చెప్పవచ్చు.
1969 ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన ఉద్యోగులు నిరంతరాయంగా తెలంగాణ ఉద్యోగాలను స్థానికేతరులు కొల్లగొట్టడాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. 1996 నుంచి తలెత్తిన మలిదశ ఉద్యమంలో ఉద్యోగులు సహజంగానే కీలకపాత్ర పోషించారు.
2001లో ఏర్పడిన తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆందోళన ఫలితంగానే గిర్గ్లానీ కమిషన్ నియమించబడింది. 2002లో గిర్గ్లానీ కమిషన్ ప్రాథమిక నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిన తీరు వివరించడంతో తెలంగాణ ఉద్యోగులు ఆ ఉత్తర్వుల అమలు కోసం ఆందోళన చేశారు. ఫలితంగానే ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల్లోని APPSC నియామకాల్లో నాన్‌లోకల్ కోటాను ఓపెన్ కోటాగా పరిగణిస్తూ జీవో 124 జారీ చేసింది.
2004లో గిర్గ్లానీ కమిషన్ పూర్తి నివేదిక వెలువడ్డాక ఉద్యోగులు 610 జీవో అమలు కోసం పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో 2006లో ఉద్యోగుల ఐ.కా.స ఏర్పడింది. 2009లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఫ్రీ జోన్ తీర్పునకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు.
ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీవో భవనం నుంచి గన్‌పార్కు వరకు అక్టోబర్ 12న భారీ ర్యాలీ నిర్వహించింది. నవంబర్ 21న సిద్దిపేటలో భారీ ఉద్యోగుల గర్జన సభ నిర్వహించింది. లక్షలాది ఉద్యోగులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా ఉద్యోగులు ప్రారంభించిన ఫ్రీ జోన్ వ్యతిరేక ఆందోళన మళ్లీ రాష్ట్ర సాధన ఉద్యమ దిశగా కీలక మలుపు తీసుకుంది.
తెలంగాణ ఉద్యమంలో వివిధ శాఖల్లోని ఉద్యోగులు జేఏసీలుగా ఏర్పడి పొలిటికల్ జేఏసీ పిలుపునందుకొని రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2011 నుంచి నడిచిన సహాయ నిరాకరణ ఉద్యమం, సకల జనుల సమ్మె వంటి కార్యక్రమాల్లో ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉందని చెప్పవచ్చు.