YV Subba Reddy | తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని తెలుగుదేశం ప్రభుత్వానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల ప్రసాదంపై తరుచూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. శ్రీవారి లడ్డూ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని ఆరోపించారని.. సిట్ ఇప్పటి వరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ప్రసాదం టెస్ట్ విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఉంటే కల్తీ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
తన హయాంలో నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామన్న ఆయన.. తిరుమల తిరుపతి దేవస్థానంలో 15 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలన్నారు. తమ హయాంలోనే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగించుకుండా నిషేధం విధించామన్నారు. లడ్డూల వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో ఇద్దరూ పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారని.. దీనిపై సైతం సిట్ క్లారిటీ ఇవ్వలేదని గుర్తు చేశారు. శ్రీవారి లడ్డూలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుబ్బారెడ్డి విమర్శించారు. ఎవరిపై సీఎం చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు. 2019-2024 వరకు తయారైన లడ్డూలన్నీ కల్తీ చేసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భక్తుల కానుకలను ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన అంశాన్ని మాజీ చైర్మన్ గుర్తు చేశారు. టీడీపీ పదవీకాలంలో జరిపిన నెయ్యి కొనుగోళ్లపై సైతం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 నుంచి 2024 వరకు చంద్రబాబు హయాంలో కల్తీ నెయ్యి ట్యాంకర్లను ఎన్నింటిని రిజెక్ట్ చేశారో చెప్పాలని సవాల్ చేశారు. తామను ఎలాంటి తప్పు చేయలేదని.. లై డిటెక్టర్ పరీక్షల, సత్య శోధన పరీక్షకు సైతం సిద్ధంగా ఉన్నానన్నారు. తాను ఏ అవినీతికి పాల్పడలేదన్నారు. యెస్ బ్యాంకులో టీటీడీ డిపాజిట్లు, శ్రీనివాస సేతు విషయంలోనూ దర్యాప్తు చేయాలన్నారు. అప్పన్న తన పీఏ కాదని.. ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎంపీ వేమిరెడ్డి వద్ద పని చేశారని వివరించారు.