సినిమా పేరు : ఆంధ్ర కింగ్ తాలూకా
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, మురళీశర్మ, రాహుల్ రవీంద్రన్, సత్య..
దర్శకత్వం: పి.మహేశ్‌బాబు
నిర్మాతలు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్..
నిర్మాణంలో ఉండగానే ఈ సినిమాపై ఆడియన్స్‌లో పాజిటివ్ బజ్ క్రియేటైంది. ఇది అభిమాని బయోపిక్ అనీ.. ఇందులో రామ్ ఓ అభిమానిగా, ఉపేంద్ర ఓ సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారనీ తెలియగానే సినిమాపై తెలీని ఆసక్తి జనాల్లో నెలకొన్నది. ప్రచార చిత్రాలు కూడా బాగా పాపులర్ అవ్వడం.. ముఖ్యంగా పాటలు జనబాహుళ్యంలో బాగా వినిపిస్తుండటం.. మైత్రీ మూవీమేకర్స్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఈ కారణాల వల్ల సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. మరి అందరి అంచనాలనూ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నిలబెట్టిందా? లేదా తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
సూర్య(ఉపేంద్ర) పేరుమోసిన సూపర్‌స్టార్. అశేషమైన అభిమానుల అతని సొంతం. అయితే.. తనకు బ్యాడ్ పిరియడ్ నడుస్తూ ఉంటుంది. విడుదలైన సినిమాలన్నీ ఫ్లాపులవుతుంటాయి. ఈ క్రమంలో సూర్య వందవ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. చిత్రాన్ని నిర్మించలేనని నిర్మాత చేతులెత్తేస్తాడు. ఓ మూడు కోట్లు ఉంటే సినిమా పూర్తవుతుంది. ఆ మూడు కోట్ల కోసం సూర్య ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఓ నిర్మాతను డబ్బు అడుగుతాడు. అతను తన కొడుకు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో తండ్రి పాత్ర వేస్తే డబ్బు సర్దుతానంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సమకూరకపోవడంతో చివరికి ఆ నిర్మాత పెట్టిన షరతుకి ఓకే చెప్పాలనుకుంటాడు. తన నిర్ణయాన్ని ఆ నిర్మాతకు చెప్పేలోపే సూర్య అకౌంట్లో మూడు కోట్లు పడతాయి. ఆ డబ్బు ఎవరు వేశారో సూర్యకు అర్థం కాదు. రాజమండ్రి దగ్గర్లోని ఓ పల్లెటూరి కుర్రాడు ఆ మూడు కోట్లు వేశాడని తెలిసి సూర్య షాక్ అవుతాడు. అతను తన అభిమాని తెలుసుకున్న సూర్య.. అతన్ని కలవాలని బయలు దేరతాడు? మరి సూర్య అభిమానిని కలిశాడా? ఓ పల్లెటూరి కుర్రాడికి ఈ మూడు కోట్లు ఎలా వచ్చాయి? అసలు ఆ కుర్రాడెవరు? అతని కథేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
విశ్లేషణ
నిజంగా కొత్త కథ ఇది. చిన్నతనం నుంచి ప్రతి విషయంలో తనకు ప్రేరణని ఇచ్చిన ఓ సినిమా హీరోపై ఓ అభిమాని చూపించే ప్రేమ ఈ కథ. తనను అమితంగా ఆరాధించే అభిమాని అన్వేషిస్తూ తనేంటో తెలుసుకున్న ఓ హీరోది ఈ కథ. సినిమా హీరోల ప్రభావం అభిమానులపై ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు మహేశ్‌బాబు.పి. సినిమాల్లో హీరో చెప్పిన డైలాగులు అభిమానులకు ప్రవచనాలకంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయని ఇందులో రామ్ పాత్రను చూస్తే అర్థమవుతుంది. హీరోకీ, ఓ అభిమానికి మధ్య ఉండే బాండింగ్‌ను అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు మహేశ్‌బాబు. ఈ కథకు ఓ ప్రేమకథను ముడిపెట్టి, సినిమాను నడిపించిన తీరు బావుంది. వేస్ట్ సీన్ ఒక్కటి కూడా సినిమాలో లేదు. వేస్ట్ క్యారెక్టర్ ఒక్కటి కూడా సినిమాలో కనిపించదు. అయితే.. ఈ సినిమా 2002లో ఈ కథ జరిగినట్టు సినిమాలో చూపించాడు దర్శకుడు. కానీ సినేరియాని బట్టి ఇంకాస్త వెనక్కెళితే బావుండేదేమో అనిపించింది. పాత్రధారుల ఆహార్యం కానీ, కరెంట్లు లేని పల్లెటూళ్లు కానీ ఆ టైమ్‌లో తెలుగునేలపై లేవు. ఓ ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి ఈ కథ చూపిస్తే ఇంకాస్త సమంజసంగా ఉండేదేమో అనిపించింది. ప్రథమార్ధం అంతా వినోద ప్రధానంగానే సాగింది. హీరోహీరోయిన్ల ప్రేమకథ.. దాని తాలూకు కామెడీ, ఎమోషన్స్ ఇవన్నీ ప్రథమార్ధంలో కనిపిస్తాయి. కానీ ద్వితీయార్ధం మాత్రం ఆద్యంతం భావోద్వేగం.. పాత్రల మధ్య సంఘర్షణలే. లక్ష్యాన్ని చేరేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆడియన్స్‌కి గూజ్బమ్స్ తెప్పిస్తాయి. కథను నడిపే విధానం.. కథనం రాసుకున్న తీరు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. మొత్తంగా సినిమా ఆకట్టుకునేలా ఉంది.
పాత్రధారులు
రామ్ పోతినేని తెరపై ఎప్పటిలాగే ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఎమోషన్స్ కూడా బాగా పలికించాడు. హీరో అభిమానిగా ఒదిగిపోయి నటించాడు. ఇక ఉపేంద్ర ఆయన నిజజీవితపాత్రే పోషించాడనాలి. ఒక సూపర్‌స్టార్‌గా తనదైన శైలిలో మెరిపించాడు. డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. భావోద్వేగాలను అద్భుతంగా పలికించాడు. భాగ్యశ్రీబోర్సేది కథలో చాలా ఇంపార్టెంట్ పాత్ర. నటించడానికి బాగా అవకాశం ఉన్న పాత్ర కూడా. అనుకున్నట్టే పాత్రకు వందశాతం న్యాయం చేసింది. చాలా అందంగా కూడా కనిపించింది. మిగతా నటీనటులంతా పరిధిమేర రక్తికట్టించారు.
సాంకేతికంగా
దర్శకుడు రాసుకన్న కథ, కథనాలు బావున్నాయి. కానీ కథ నడిచే టైమింగ్ కరెక్ట్ కాదు. ఈ క్రమంలో పాత్రధారులు ఆహార్యం కూడా కరెక్ట్ కాదు. అవేమీ పట్టించుకోకుండా కేవలం కథగా చూస్తే సినిమా బావుంది. సంగీతం కూడా బావుంది. పాటలు వినదగ్గ విధంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. మైత్రీ సంస్థ ఏ విషయంలోనూ వెనుకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. తాము పెట్టిన ప్రతి పైసా తెరపై కనిపించింది. కెమెరా వర్క్ కూడా అభినందనీయంగా ఉంది.
మొత్తంగా మాస్ అంశాలతో కూడిన ఎమోషనల్ మూవీ ఇది. ఓ కొత్త అనుభూతినిచ్చే కథ. మాస్ ప్రేక్షకులనే కాదు, కొత్త దనాన్ని కోరుకునే వారికి కూడా నచ్చే సినిమా ఇది.
బలాలు
కథ, కథనం, నటీనటుల నటన..
బలహీనతలు
కథకు పొంతనలేని సినేరియా, ప్రథమార్ధం కాస్త స్లోగా సాగడం..
రేటింగ్ : 3.25/5