హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ప్రజాపాలనగా లేదని ప్రజా కంటక పాలనగా కొనసాగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ( Harish Rao) ఆరోపించారు.బుధవారం తెలంగాణ భవన్లో లైసెన్స్డ్ సర్వేయర్ల ( Licensed Surveyors ) సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వం 70వేల ఉద్యోగాలు ఇచ్చామని, గొప్పలు చెప్పుకోవడమే తప్ప, వారికి జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. జీతాలు ఇవ్వం మీరు రైతుల దగ్గర లంచాలు తీసుకోండి అని ప్రభుత్వం పరోక్షంగా సూచిస్తుందని విమర్శించారు. యువత సాధించనది ఏదీ లేదని, ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా జెన్ జీ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు.
ప్రభుత్వం పని చేస్తే ప్రతిపక్ష పార్టీ వద్దకు ప్రజలకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. సర్వేయర్ల సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు సర్వేయర్లు ఆత్మహత్య చేసుకున్నారని, వారి సమస్యలను
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రస్తావిస్తుందని వెల్లడించారు. ఉద్యోగాల విషయంలో రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు.