వాషింగ్టన్: వాయువ్య అమెరికాలో మంగళవారం రాత్రి బాంబు సైక్లోన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీచడంతోపాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు నేల కూలడంతో ఇండ్లు దెబ్బతిన్నాయి. వాషింగ్టన్లోని లిన్వుడ్లో ఓ పెద్ద చెట్టు కూలిపోవడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యంత వేగంగా తీవ్రరూపం దాల్చిన ఈ భారీ తుపానును బాంబు తుఫాను అని పేర్కొంది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా, ఉత్తర కోస్తా, శాక్రమెంటో వ్యాలీలలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం వరకు నైరుతి ఒరెగావ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు రావచ్చునని సూచించింది. వాషింగ్టన్ స్టేట్లో బుధవారం ఉదయం 6 లక్షలకుపైగా ఇండ్లకు విద్యుత్తు సరఫరా లేదని వార్తలు వచ్చాయి.