న్యూఢిల్లీ: సెంట్రల్ పూల్‌లో గోధుమ నిల్వల్లో కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో మంగళవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జూలై ఒకటో తేదీ నాటికి 285.10 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు స్టాక్‌లో ఉన్నాయని, బఫర్ నార్మ్ 275.80 లక్షల మెట్రిక్ టన్నులు అని మంత్రి తెలిపారు. ప్రైవేటులో గోధుమ కొనుగోళ్లు పెరగడం వల్ల ప్రభుత్వం గోధుమ సేకరణ తగ్గింది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు మంత్రి అవును అని సమాధానం ఇచ్చారు. వ్యాపారస్తులు ఎక్కువగా గోధుమలను కొంటున్నారని, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో గోధుమలకు డిమాండ్ పెరిగిందని, ఈ నేపథ్యంలో గోధుమ సేకరణ తగ్గినట్లు మంత్రి తోమర్ చెప్పారు. ఎంఎస్పీ కన్నా మంచి ధర వస్తే అప్పుడు రైతులు ఆ పంటను స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అన్నారు. ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధరకు గోధుమ అమ్ముడుపోతోందని,దీని వల్ల కేంద్రం తక్కువ మోతాదులో గోధుమలు కొనాల్సి వస్తోందని మంత్రి చెప్పారు.