అమరావతి : ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (Yamini Krishnamurthy) మరణం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandra babu) అన్నారు. భరతనాట్యం (Bharatanatyam) , కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో ఆమె నిష్ణాతురాలని అన్నారు. నృత్యరంగంలో యామినీ కృష్ణమూర్తి లేని లోటు ఎవరూ తీర్చలేరని పేర్కొన్నారు. యామినీ మృతి విషయం తెలిసి తీవ్ర ఆవేదన చెందానని వెల్లడించారు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
చిన్న వయసులోనే కర్ణాటక సంగీతం సైతం నేర్చుకొని పాటలు పాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. యామనీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించింది. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. ఆమె కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో వేలాదిగా ప్రదర్శనలిచ్చారు.
యామినీ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆస్థాన నర్తకిగా పని చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నృత్య కేంద్రం స్థాపించి పలువురికి శిక్షణ ఇచ్చారు. ఆమెకు భారతీయ కళారంగానికి చేసిన సేవకు కేంద్రం తొలిసారిగా 1968లో పద్మశ్రీతో సత్కరించింది. 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందింది. అలాగే, 1977లో సంగీతనాటక అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు.