యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 21: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పాడి రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. లీటర్ పాలకు రూ.4 బోనస్, రూ.30 కోట్ల గ్రాంట్స్ ఎక్కడ? అని సర్కార్‌ను నిలదీశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నార్ముల్ సంస్థ డైరెక్టర్ కస్తూరి పాండు ఆధ్వర్యంలో నార్ముల్ సంస్థ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, డైరెక్టర్లు మోతె సోమిరెడ్డి, కందాల అలివేలు రంగారెడ్డి, పాల సంఘం చైర్మన్లు మారెడ్డి కొండల్‌రెడ్డి, సందీళ్ల భాస్కర్గౌడ్తోపాటు సుమారు 200 మంది పాల సంఘం చైర్మన్లు, పాడి రైతులు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు గొంగిడి మహేందర్‌రెడ్డి మద్దతు పలికి మాట్లాడారు. వెంటనే 7 పెండింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు లీటర్‌కు రూ.4 బోనస్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాడి రైతంటే తెలియని నార్మూల్ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డితో ఆ సంస్థ మూతపడే పరిస్థితికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో నార్ముల్ సంస్థ రోజుకు 1.20 లక్షల పాల సేకరణ చేసి లాభాల్లో ఉంటే, రేవంత్‌రెడ్డి పాలనతో రోజుకు కేవలం 40 వేల లీటర్లకు పడిపోయిందని ఆవేదనచెందారు. పాడి రైతులకు ఇవ్వాల్సిన 7 బిల్లులు ఇస్తారో ఇవ్వరో తెలియని అయోమయంలో ఉన్నదని మండిపడ్డారు.
సంస్థ నుంచి హాస్టల్‌కు సరఫరా చేసే పాలు, యాదగిరిగుట్టతోపాటు రాష్ట్రంలో ఇతర ప్రధాన ఆలయాలకు సరఫరా చేసే నెయ్యి సైతం సీఎం రేవంత్‌రెడ్డి ఒకే ఒక జీవోతో నిలిచిపోయిందని అన్నారు. రైతులంటే రేవంత్‌రెడ్డికి ఎందుకు ఇంత కోపమని ప్రశ్నించారు. 40 ఏండ్ల్లుగా సంక్షేమ హాస్టళ్లకు పాలు, గుట్ట దేవస్థానాలకు నెయ్యి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంత్రి కోమటిరెడ్డి వెం కట్రెడ్డి, ఎమ్మెల్యే అయిలయ్య తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. ఈ నెల 27న నార్ముల్ సంస్థలో 3 డైరెక్టర్ పదవులకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను చిత్తుగా ఒడించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.