Nizamabad | వినాయక నగర్, జూలై 11: నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ సృష్టించింది. ఒకే రాత్రి నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాటా సుమోలో వచ్చిన నలుగురు దొంగలు ముందుగా నిర్మల్ జిల్లాలోని ఓ అపార్ట్మెంట్లో దోపిడీకి పాల్పడ్డారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి, తెల్లవారుజామున ఆర్మూర్ పట్టణంలోని ఓ మెడికల్ షాప్ షట్టర్ ధ్వంసం చేసి అందులోని సుమారు లక్షన్నర నగదును దోచుకున్నారు.
అనంతరం ఆ దొంగల ముఠా తమ వాహనంలో తెల్లవారుజామున 4.55 గంటల వరకు శ్రీనగర్ కాలనీకి చేరుకుని.. లక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు తెంపుకుని పరారయ్యారు. ఆ తర్వాత ఉదయం 5.25 గంటల వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడుతో పాటు ఒక చెవికమ్మను లాక్కున్నారు. మరో చెవికమ్మ లాక్కునే ప్రయత్నం చేస్తుండగా బాధితురాలి కేకలు విని ఆమె భర్త బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో వారు టాటా సుమో వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా ఈ చోరీలకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఘటనాస్థలిని పరిశీలించిన నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య ఘటనాస్థలిని క్షుణ్నంగా పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాలని.. నిందితులను వేగంగా పట్టుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.