కోట్లాది మందిని ప్రభావితం చేసేలా మరో కీలకమైన ప్రజా వ్యతిరేక నిర్ణయానికి మోదీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కార్మికులకు అండగా నిలుస్తున్న 44 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ యాక్టులను తీసుకువచ్చేందుకు సిద్ధం కావడంతో కార్మిక లోకం నిరసన తెలుపడానికి సిద్ధమవుతున్నది. కేంద్రం మెడలు వంచేందుకు కార్మికులంతా సోమ, మంగళవారాల్లో సార్వత్రిక సమ్మెతో ఉద్యమ బాటపట్టనునన్నారు. కార్మికులతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ బ్యాంకుల ఉద్యోగులంతా సమ్మెకు సై అంటున్నారు.
నిజామాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజల జీవనోపాధి, హక్కులపై అధికార గర్వంతో అత్యంత క్రూరంగా చట్టాలను తీసుకువచ్చేందుకు భారతీయ జనతా పార్టీ వెనుకాడడం లేదు. కొవిడ్ ఉగ్రరూపం దాల్చిన సమయంలో వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి మూడు నల్లచట్టాలను ప్రభుత్వం తీసుకు వచ్చింది. రైతుల ఆగ్రహంతో ఏడాదిన్నర తర్వాత యావత్ భారత జాతికి క్షమాపణలు కోరిన ప్రధాని నరేంద్ర మోదీ తోకముడిచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కోట్లాది మందిని ప్రభావితం చేసే విధంగా మరో కీలకమైన ప్రజా వ్యతిరేక నిర్ణయానికి మోదీ ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి కార్మిక లోకానికి పెద్ద అండగా నిలిచిన, నిలుస్తున్న 44 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ యాక్టులను తీసుకువచ్చే కుట్రకు బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడంతో కార్మిక లోకం నిరసన తెలిపేందుకు రెడీ అయ్యింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మెడలు వంచేందుకు కార్మికులంతా రెండు రోజుల సార్వత్రిక సమ్మెతో ఉద్యమబాట పడుతున్నారు. కార్మికులతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ బ్యాంకుల ఉద్యోగులంతా సమ్మెకు సై అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ అనేక సంఘాలు మోదీకి వ్యతిరేకంగా సమ్మెకు సిద్ధమవ్వడం విశేషం.
మరోసారి సార్వత్రిక సమ్మె..
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక లోకం సార్వత్రిక సమ్మెలకు దిగడం నిత్యకృత్యమైంది. కేంద్రం అవలంభిస్తున్న విధానాలతో కార్మికులంతా ఐక్యంగా కదిలి బీజేపీ ప్రభుత్వానికి నిత్యం నిరసనలు తెలుపాల్సిన దుస్థితి నెలకొన్నది. 2014 నుంచి నేటి వరకు వివిధ రూపాల్లో సార్వత్రిక సమ్మెలు 20కి పైగా జరిగినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇంతగా సమ్మెలు చేసిన దాఖలాలే లేవని వివరిస్తున్నారు. మోదీ అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలు, సామాన్య జనాలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్న నిర్ణయాలతో సమ్మెబాట తప్పడం లేదని సంబంధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 58 శాతం సంపద కేవలం ఒక శాతం ఉన్న పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నది. అనేక అంతర్జాతీయ సంస్థల రిపోర్టులు ఇదే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వానికి కనీసం చలనం కలగడం లేదు. మార్చి 28, 29 తేదీల్లో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జాతీయ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. అదేవిధంగా కార్మికులంతా ఆందోళనలో పాల్గొంటూ పనులకు దూరంగా ఉండనున్నారు. ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ సమ్మె కొనసాగనున్నది. నిజామాబాద్ జిల్లాలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘం టీఆర్ఎస్కేవీ సంఘీభావంగా ఆందోళనలు చేపట్టబోతున్నాయి.
సమానత్వానికి సమాధి..
గోరు చుట్టూ రోకలి పోటు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం ఏకంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మడంతో పాటు కార్మిక చట్టాల రద్దుకు పూనుకున్నది. ఆర్టికల్ 14, 16, 19, 21 ఆధారంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలిరోజుల్లో అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేయడానికి భారత ప్రభుత్వం పూనుకున్నది. పెట్టుబడిదారులకు రక్షణగా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన కోడ్ పేరుతో నాలుగు కోడ్లను కేంద్రం రూపొందించింది. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్రం ఈ కోడ్లను తీసుకువస్తున్నదని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక సంబంధాల కోడ్‌తో పరిశ్రమలో గుర్తింపు, పరిశ్రమల్లో కార్మికులు సమ్మె చేయడానికి ఉన్న అవకాశాలన్నీ నామరూపాల్లేకుండా పోనున్నాయి. భద్రత ఆరోగ్యం పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌లో ప్రమాదాలు జరిగితే కార్మికులను బాధ్యులను చేస్తున్నది. గతంలో యాజమాన్యాలే బాధ్యత వహించేవి. సామాజిక భద్రత కోడ్ అమల్లోకి వస్తే నిర్మాణ రంగంలోని అసంఘటిత కార్మికుల ప్రయోజనాలు దెబ్బతినబోతున్నాయి. వేతనాల కోడ్‌లో ఇకపై కార్మికులకు పనికి తగిన వేతనం పొందే అవకాశం కోల్పోనున్నారు. యాజమాన్యం దయాదాక్షియ్యాల మీదనే పెంపు ఉండబోతుండగా శ్రమ దోపిడీని ఈ కోడ్ ప్రోత్సహించేలా మారనుంది.
మోదీ నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేకమే..
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొంతకాలంగా కార్మిక వ్యతిరేక విధానాలను బలవంతంగా అమలు చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రజా, కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ప్రతి నిర్ణయం, వారు చేయబోయే చట్టాలన్నీ కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసేలా ఉంటున్నాయి. సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలను తలపెడుతున్నాం. కార్మిక, కర్షకుల కోపాగ్నికి బీజేపీ మాడి మసైపోతుంది.
– విజయలక్ష్మి, టీఆర్ఎస్కేవీ, జిల్లా ప్రధానకార్యదర్శి