నిజామాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్పేటలో వెలుగుచూసిన ఎర్రజొన్న నకిలీ విత్తనాల కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు మార్చి 23న బాల్కొండ పోలీస్‌స్టేషన్‌లో వ్యాపారి భాస్కర్‌పై కేసు నమోదైంది. రైతులు తిరగబడడంతో భారతీయ జనతా పార్టీకి చెందిన సదరు వ్యక్తి.. కీలక నేతల సహకారంతో పరారయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే కటకటాలకు పంపాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడంతో అక్రమాలు చేసిన వ్యక్తుల్లో వణుకు పుడుతున్నది. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు ఆధారంగా శోధన మొదలుపెట్టడంతో బీజేపీ నాయకుడు పత్తా లేకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లుగా తెలుస్తున్నది.
తెలంగాణ సరిహద్దును దాటి గుజరాత్లో తలదాచుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. పక్క రాష్ర్టానికి సైతం వెళ్లి నిందితుడిని పట్టుకునే పనిలో నిమగ్నమైనట్లుగా తెలుస్తున్నది. నకిలీ విత్తనాలతో అమాయక రైతులను మోసగించే వారిపై పీడీ యాక్టు ద్వారా జైలుకు పంపాలని సీఎం కేసీఆర్ ఇదివరకే వ్యవసాయ శాఖకు ఆదేశాలిచ్చారు. తదనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగం సీరియస్‌గా నకిలీ విత్తనాలు విక్రయించిన బీజేపీ నాయకుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. కల్తీ విత్తనాల వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతుండగా మరో రూ.80 లక్షల విలువ చేసే కల్తీ విత్తనాలు వెలుగు చూడగా వాటిని సీజ్ చేశారు.
నమ్మించి ముంచడం…
నకిలీ విత్తనాలతో రైతులు నిలువునా మోసపోతున్నారు. ఈసారి ఆ బెడద ఆర్మూర్ డివిజన్లోని రైతులకు వచ్చి పడింది. ఎర్రజొన్న విత్తనాలను నాటిన కొందరు రైతులకు నమ్మలేని నిజం ఇప్పుడు తీవ్రంగా కలిచివేస్తున్నది. ఆరునెలల కష్టం నేలపాలు కాగా పంట దిగుబడులు రాకపోవడంతో రైతన్నలంతా దిగాలు పడుతున్నారు. తమకు విత్తనాలు అమ్మిన వ్యాపారులు, విత్తన కంపెనీ బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు.
‘ఇదిగో అత్యుత్తమైన విత్తనం.. ఈ విత్తనం మీ పొలంలో వేస్తే ఊహించని ఫలితాలంటూ నమ్మిస్తారు. మా ఎర్రజొన్న విత్తనాలు నాటితే రైతులకు లాభాలు ఖాయం. అనుకున్నంత పంట రాకపోతే నష్టాలు మేమే భరిస్తాం’ అంటూ విత్తన సంస్థల ప్రతినిధులు మాయమాటలు చెప్పి రైతులను నిత్యం మోసం చేస్తున్నారు. విత్తన కంపెనీలు, విక్రయదారుల మాటలు విన్న అమాయక కర్షకులు వేల రూపాయలు ఖర్చు చేసి సాగు చేయగా తీరా పంట కాలం ముగిశాక చేతికి చిక్కేది ఏమీ ఉండదు. వేసిన విత్తు వేసినట్లే చిత్తవ్వడం తప్ప లాభాలు దక్కడం గగనమయ్యే దుస్థితి ఏర్పడుతున్నది. ఇలా నిజామాబాద్ జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట నకిలీ విత్తన వ్యాపారుల ఆగడాలకు అమాయకులైన రైతులు బలి అవుతూనే ఉన్నారు.
ఒక్కోటిగా బయటపడుతున్న బీజేపీ బాగోతం..
భారతీయ జనతా పార్టీ బాగోతం ఒక్కోటి బయట పడుతున్నది. నిజామాబాద్ జిల్లాలో మూడు నెలల క్రితమే బీజేపీకి చెందిన ఓ వ్యక్తి వేధింపులు తాళలేక ఓ వ్యాపారి కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడింది. మరణానికి ముందు కృష్ణా నది ఒడ్డున బీజేపీ నేతల పేర్లు చెప్పి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటన మరువక ముందే ఓ భూ వ్యవహారంలో మహిళను వేధిస్తూ బీజేపీకి చెందిన వ్యక్తి బూతు పురాణాలు అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు బాధిత మహిళ నేరుగా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో నేతల తీరు బట్టబయలు కాగా బీజేపీ నిజామాబాద్ జిల్లా శాఖ వెంటనే సదరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నది. ఈ ఘటనలు జరిగి కొద్దిరోజులు కూడా కాకముందే బీజేపీకి చెందిన మరో నాయకుడు ఏకంగా రైతులను నిలువునా ముంచేయడం కలకలం రేపుతున్నది. తీరా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు వ్యాపారి దర్యాప్తు అధికారులకు చిక్కకుండా తిరుగుతుండడం గమనార్హం. నిజామాబాద్‌లో వెలుగు చూస్తున్న అనేక అక్రమ వ్యవహారాల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన వారు నిత్యం పాత్రధారులుగా, సూత్రధారులుగా ఉండడం విస్తుగొల్పుతున్నది.