నిజాంసాగర్, మార్చి 27 : దళిత బంధు పథకాన్ని దళిత కుటుంబాలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి కోరారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ఎంపీడీవో పర్బన్న గత సమావేశంలో చర్చకు వచ్చిన సమస్యలు వాటి పరిష్కార మార్గాలు, పెండింగ్లో ఉన్న సమస్యల గురించి ముందుగా చదివి వినిపించారు. అనంతరం మండ ల శాఖ అధికారులు వ్యవసాయశాఖ అధికారి అమర్ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుమలత, ట్రాన్స్కో ఏఈ లక్ష్మణ్, నీటి పారుదల శాఖ ఏఈ శివ, పంచాయతీ రాజ్ ఏఈ మారుతి, వెటర్నరీ వైద్యులు యూనుస్, మండల వైద్యాధికారి రాధాకిషన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీలక్ష్మి, సుమతి, ఐకేపీ ఏపీఎం రాంనారాయణగౌడ్ తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.
అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. మండలంలోని ఆయా గ్రామాల్లో దళితబంధు అవగాహన సమావేశాలు పూర్తయ్యాయని, అందురూ ఒకే యూనిట్ కాకుండా ఒక్కొ క్కరూ ఒక్కో రకమైన యూనిట్ పెట్టుకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. పథకాన్ని నిర్లక్ష్యం చేయడంతోపాటు పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు గ్రామాల్లోని లబ్ధిదారులకు మరింత అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ శాఖ అధికారు లు గ్రామాల్లో స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేశ్గౌడ్తోపాటు ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యు లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.